పాఠశాలలు తెరిచి తరగతి గదుల్లో విద్యా బోధన ప్రారంభమయ్యే వరకు ఈ విద్యా సంవత్సరం ఇంటి వద్ద నుంచే విద్యార్థులు చదువుకునేందుకు సీబీఎస్‌ఈ తరహాలో ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్‌ను అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి విధి విధానాలను కొద్ది రోజుల్లో ప్రభుత్వం ప్రకటించనుంది. ఆగస్టు మొదటి వారం నుంచి దీన్ని అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏమిటీ ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్?
ఒకటి నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్‌ఈ ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్‌ను రూపొందించి ఏప్రిల్ నుంచే అమలు చేస్తున్నారు. ఇందులో పుస్తకాల్లోని పాఠాలు చెప్పడానికే ఉపాధ్యాయులు పరిమితం కారు. కళలు (ఆర్ట్స్ ఎడ్యుకేషన్), వ్యాయామం, యోగా, వృత్తి విద్య తదితరాలను బోధిస్తున్నారు. ఆసక్తిగా...సొంతంగా నేర్చుకునేలా ప్రాజెక్టులు, అసైన్‌మెంట్ల తదితరాలను అమలు చేస్తున్నారు.
రాష్ట్రంలో రెండు వారాల తర్వాత సిలబస్ బోధన
రాష్ట్రంలో మొదటి రెండువారాల్లో గతంలో చదివిన పాఠ్యాంశాలను గుర్తు చేయడం, ప్రాథమికాంశాలపై అవగాహన పెంచడం, విన్న పాఠాలపై కృత్యపత్రాల ద్వారా సాధన చేయడంలాంటి కార్యక్రమాలను అమలు చేస్తారు. మూడోవారం నుంచి తరగతికి సంబంధించిన సిలబస్ బోధన సాగుతుంది.
ప్రస్తుతం టీశాట్‌లో భాగమైన విద్య ఛానల్ ద్వారా రోజుకు ఒక్కో తరగతికి 45 నిమిషాల చొప్పున 6-10 తరగతులకు రెండు లేదా మూడు పాఠాలను బోధించనున్నారు. అంతేకాకుండా నిపుణ ఛానల్‌తోపాటు దూరదర్శన్ యాదగిరి ఛానెల్ ద్వారా కూడా పాఠాలను ప్రసారం చేయనున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 36,221కి చేరిన కరోనా బాధితులు..