ED Raids in Hyderabad: దిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు ఆధారాలను సేకరిస్తున్నారు. మద్యం పాలసీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా.. ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈడీ అధికారులు నిన్నటి నుంచి హైదరాబాద్‌లోని 5 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.
రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ పటేల్ రోడ్డులోని నవకేతన్ భవన్లో రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ చిరునామా ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అక్కడికి వెళ్లి తనిఖీ చేసిన ఈడీ అధికారులకు సదరు చిరునామాలో ఓ పేరొందిన బ్యూటీ పార్లర్ ఉన్నట్లు తేలింది. రాబిన్ డిస్ట్రిబ్యూషన్స్‌లో డైరెక్టర్‌గా ఉన్న అభిషేక్ రావు సదరు బ్యూటీ పార్లర్ సంస్థలకు డైరెక్టర్‌గా ఉన్నారు. హైదరాబాద్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు తప్పుడు చిరునామా ఇచ్చినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ ఈమెయిల్ అడ్రస్ సైతం ఒకటేనని ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది. కోకాపేట్‌లోని రాంచంద్ర పిళ్లై నివాసంలోనూ ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. పలువురి రాజకీయ ప్రముఖులతో రాంచంద్ర పిళ్లైకి సంబంధాలున్నట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు తగిన ఆధారాలు సేకరిస్తున్నారు.
ఇవీ చదవండి: