EAMCET and ECET dates announced: టీఎస్ ఎంసెట్, ఈసెట్ షెడ్యూలును రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. జులై 14 నుంచి ఎంసెట్ నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులకు జులై 14, 15న... ఇంజినీరింగ్ అభ్యర్థులకు జులై 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ నిర్వహించనున్నట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన అభ్యర్థులు ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్ను జులై 13న నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.
ప్రవేశపరీక్షలను 23 రీజినల్ సెంటర్ల పరిధిలో 105 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తామని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి, ఇతర ఉన్నతాధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు. మే నెలలో ఇంటర్, పదో తరగతి పరీక్షలు జరగనున్నందున.. జులైలో నిర్వహించాలని నిర్ణయించారు. దరఖాస్తు గడువు, రిజిస్ట్రేషన్ ఫీజు తదితర వివరాలతో కూడిన నోటిఫికేషన్లు సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారని మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి: హైదరాబాద్లో డిజిటెక్.. కేటీఆర్ సమక్షంలో కాల్ అవే గోల్ఫ్ ఒప్పందం