తెలుగురాష్ట్రాల్లో దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే 668 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. గత ఏడాది 381 రైళ్లను నడిపామని.. ఈఏడాది మరో 287 రైళ్లను పెంచినట్లు రైల్వే అధికారులు తెలిపారు. వీటితోపాటు పది జనసాధారణ్ రైళ్లు అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించారు.
ప్రతిరోజు రెండు లక్షల మంది ప్రయాణం
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతి రోజు లక్షా 80వేల మంది ప్రయాణికులు, హైదరాబాద్ (నాంపల్లి), కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి దాదాపు లక్ష మంది ప్రయాణికులు నిత్యం ప్రయాణిస్తుంటారు. దసరా, దీపావళి పండుగల సమయంలో వీటికి రెండింతలుగా ఉంటుంది. పర్యటక ప్రాంతాలు, దైవ దర్శనానికి వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం తిరుపతి, నాగర్ సోల్ వంటి ప్రాంతాలతో పాటు.. నర్సాపూర్, ఔరంగబాద్, నాందేడ్, కాకినాడ, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, మచిలీపట్నం, రాయచూర్ వంటి ముఖ్యమైన ప్రాంతాలకు రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
అత్యాధునిక కెమెరాలతో నిఘా..!
ప్రయాణికుల సౌలభ్యం కోసం అదనపు టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రత కోసం ఆర్.పీ.ఎఫ్, జీ.ఆర్.పీ పోలీసులు రైల్వే స్టేషన్లు, రైళ్లలో గస్తీ ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలతో నిఘా మరింత పెంచినట్లు అధికారులు వెల్లడించారు.
రైళ్లకు అదనపు కోచ్‌లు సిద్ధం
ప్రత్యేక రైళ్లలో అదనంగా 10నుంచి 25శాతం ధరలు వసూలు చేస్తున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. రోజూ నడిచే రైళ్లకు ప్రయాణికుల రద్దీని బట్టి అదనపు కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నామని రైల్వే అధికారులు వివరించారు. ప్రతిరోజూ 20 నుంచి 25 అదనపు కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్లాట్ ఫాం టికెట్ ధరలు ఎంతంటే..?
ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని తగ్గించడంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ప్లాట్ ఫాం టికెట్ ధరలను రూ.10 నుంచి రూ.30వరకు పెంచినట్లు అధికారులు తెలిపారు. పెరిగిన ప్లాట్ ఫాం టికెట్ ధరలు ఈరోజు నుంచి అక్టోబర్ 10 వరకు అమల్లో ఉంటాయి.
ఇవీ చూడండి: టిక్‌టాక్ స్టార్ తెలుగమ్మాయి మరణం వెనక ఉన్న కథ