Drunken People Hulchul in Hyderabad : రాష్ట్రవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటిన వేళ.. కొన్నిచోట్ల మందుబాబులు రెచ్చిపోయారు. హైదరాబాద్ మాదాపూర్‌లో 37 చెక్‌పోస్టులు ఏర్పాటు చేయగా.. 166 మందిపై కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం ఆంధ్రకేసరినగర్‌లో మద్యం తాగిన వాహనదారుడు అర్ధరాత్రి బీభత్సం సృష్టించాడు. గల్లీ రోడ్డులో అతివేగంగా కారు నడుపుతూ.. మత్తునెత్తికెక్కి అపార్ట్మెంట్ గోడను ఢీ కొట్టాడు. ప్రమాదానికి కొద్ది నిముషాల ముందే మహిళలు, చిన్నారులు అపార్ట్మెంట్లలోకి వెళ్లిపోయారు. లేదంటే పెనుప్రమాదం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవ్ చేసిన యువకుడికి ఎలాంటి గాయాలు కాలేదు. తాగి వాహనం నడిపి ప్రమాదానికి కారణమయ్యాననే పశ్చాత్తాపం కూడా యువకుడిలో కనిపించలేదు. ఏదో సాహసం చేసిన వాడిలా.. కారు డోర్ తెరిచి జంప్ చేస్తూ బయటకు దూకాడు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ప్రమాద తీవ్రతకు ఇన్నోవా వాహనం నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న యువకులు మద్యం తాగారని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మహిళ హల్‌చల్..
Drunken People Hulchul on New Year : మద్యం మత్తులో అర్ధరాత్రి వేళ.. ఓ మహిళ వీరంగం సృష్టించింది. నూతన సంవత్సర వేడుకల్లో మద్యం తాగిన యువతి.. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న పోలీసులపట్ల దురుసుగా ప్రవర్తించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద బంజారాహిల్స్ పోలీసులను దుర్భాషలాడింది. వాహనాలు నిలిపి తనిఖీ చేస్తుండగా ముంబయికి చెందిన మహిళ, మరికొందరు వాహనంలో అటువైపుగా వచ్చారు. కారు నిలిపి బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేస్తుండగా పోలీసులను దుర్భాషలాడుతూ దాడిచేసేందుకు సదరు మహిళ యత్నించింది. ఆమెతో పాటు మిగతా వాళ్లను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ట్రాఫిక్ ఎస్సైపై మందుబాబుల వీరంగం..
Drunken People Hulchul in Telangana 2022 : జగిత్యాల జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 89 మందిపై కేసులు నమోదు చేశారు. కొందరు మందు బాబులు.. పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ వీరంగం సృష్టించారు. జగిత్యాల పట్టణంలో ట్రాఫిక్ ఎస్సై నవత నిర్వహించిన.. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో కొందరు మందు బాబులు ఆమెపై దురుసుగా ప్రవర్తించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని గుర్తించి జరిమానాలు విధించారు.
యువకుల దాడి.. బావిలో పడి ఇంటర్ విద్యార్థి మృతి..
Drunken People Hulchul on December 31st : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరులో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో యువకుల బృందం దాడి చేయటంతో.. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఇంటర్ విద్యార్థి కళ్లెం రమేశ్ బావిలో పడి మృతిచెందాడు. మృతికి కారణమైన 8 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాచలంలో వాహనాల తనిఖీల్లో.. 11 మందిపై కేసు నమోదు చేశారు.
ఇదీచూడండి: Minor Girls Rape in Vijayanagaram : న్యూ ఇయర్ రోజునే ఇద్దరు బాలికలపై అత్యాచారం