Dopams App In telangana Police Departmentమారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నేరాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. పోలీస్ సంస్కరణల్లో దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. ఆ దిశగా ఫేస్ రికగ్నేషన్, ఫింగర్ ప్రింట్ వంటి వివిధ అప్లికేషన్స్ సిద్ధంచేసి నేరగాళ్లకు సంబంధించిన పూర్తిసమాచారాన్ని నిక్షిప్తం చేస్తున్నారు. వివరాల ఆధారంగా ఇతర రాష్ట్రాలు సైతం పలువురు నేరగాళ్లను అదుపులోకి తీసుకుంటున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న మాదకద్రవ్యాల సరఫరాపైనా పోలీసులు దృష్టిపెట్టారు.
మాదకద్రవ్యాల ముఠాలు ఒక చోట నేరానికి పాల్పడితే ఆ సమాచారం అక్కడితో ఆగిపోతోంది. మరో ప్రాంతంలో నేరం చేసినా... పాత నేరానికి సంబంధించిన వివరాలు పోలీసులకు తెలియడం లేదు. డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో పాటు... ఆయా రాష్ట్రాల పోలీసులకు పట్టుబడుతున్న ముఠాల సమాచారం ఏజెన్సీలకే పరిమితమవుతోంది. వివిధ ముఠాల్లోని స్మగ్లర్ల సమాచారం అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల వేరేచోట నేరాలకు పాల్పడినా సమాచారం అందుబాటులో ఉండటంలేదు. ఆ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర పోలీసులు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తెరపైకి తెచ్చారు. మాదకద్రవ్యాల ముఠాలకు చెందిన సమగ్ర వివరాలతో డేటాను సిద్దం చేస్తున్నారు. కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగం ఆధ్వర్యంలో.... డ్రగ్స్ అఫెండర్స్ ప్రొఫైలింగ్, అనాలసిస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్స్ -డోపమ్స్ పేరిట ప్రత్యేక అప్లికేషన్ రూపొందించారు.
నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ చట్టంకింద... రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసులకు సంబంధించిన వివరాలను యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని 746 పోలీస్‌స్టేషన్లలో యాప్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పటికే మనుగడలో ఉన్న టీఎస్ కాప్ యాప్‌కు డోపమ్స్‌ని అనుసంధానం చేశారు. అన్ని పోలీస్‌స్టేషన్‌లలో నమోదైన మాదకద్రవ్యాల కేసుల్లోని స్మగ్లర్ల పూర్తి వివరాలను నిక్షిప్తంచేసే పనిలో నిమగ్నమయ్యారు. మాదకద్రవ్యాల సరఫరా నేరగాళ్లకు చెందిన సమగ్ర సమాచారం తెలుసుకునేలా డోపమ్స్ యాప్ రూపొందించారు. స్మగ్లర్ పేరు, చిరునామా, బంధువులు, స్నేహితుల వివరాలతోపాటు ఆ వ్యక్తి ఎక్కడి నుంచి మాదకద్రవ్యాలు సేకరిస్తాడు, ఎక్కడికి తరలిస్తాడు, స్మగ్లింగ్ చేసే విధానం, రవాణదారా లేక సరఫరాదారుడా, సరఫరాకు సంబంధించిన వివరాలు.. ఇప్పటి వరకు ఎన్ని కేసుల్లో ప్రేమేయముందనే సమాచారన్ని యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లోని ఎన్డీపీఎస్ కేసుల వివరాలు అందులో చేర్చనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 14,368 పోలీస్‌స్టేషన్‌లలోని స్మగ్లర్ల వివరాలు డోపమ్స్‌లో నమోదుకానున్నాయి.
స్మగ్లర్ల గుట్టు విప్పే డోపమ్స్ యాప్ ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని... పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వరుస నేరాలకు పాల్పడే వారిని గుర్తించి వారిపై.. పీడీ చట్టం ప్రయోగించే అవకాశం ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: