కరోనా మహమ్మారి బారిన పడకూడదంటే ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం తప్పనిసరి! అలాగని ఏది ముట్టినా, పట్టినా చేతులు కడుక్కోవడం కుదరదు.. పైగా అన్ని సమయాల్లో మన వద్ద సబ్బు, నీళ్లు అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకే ఇలాంటప్పుడు శానిటైజర్ వాడడం మనకు అలవాటైపోయింది. దాదాపు ఏడాది కాలంగా మనం దీన్ని వాడుతున్నా.. ఇంకా దీని గురించి చాలామందిలో చాలా రకాల సందేహాలున్నాయని చెప్పచ్చు. వాడిన ప్రతిసారీ ఎంత మోతాదులో వాడచ్చు? ఒకవేళ ఎక్కువగా వాడితే ఇతర ఆరోగ్య సమస్యలేవైనా వస్తాయేమో? పదే పదే శానిటైజర్ వాడే కంటే గ్లౌజులు పెట్టుకోవడం మంచిదేమో?.. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన సందిగ్ధం నెలకొంది.. అయితే తాజాగా ఇదే విషయంపై స్పష్టతనిచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ). హ్యాండ్ శానిటైజర్ల వాడకం గురించి చాలామందిలో నెలకొన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ అసలు నిజాలేంటో ఓ సోషల్ మీడియా పోస్ట్ రూపంలో వివరించింది. మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..
కనీసం 60 శాతం ఇథైల్ ఆల్కహాల్ లేదా ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఉన్న శానిటైజర్లు వాడడం మంచిదని కరోనా వచ్చిన కొత్తలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఎంతోమంది వైద్య నిపుణులు మనకు సూచించిన విషయం తెలిసిందే! ఇలాంటి శానిటైజర్ అయితే మన చేతులకు అంటుకున్న బ్యాక్టీరియా, వైరస్‌లను సమూలంగా నాశనం చేస్తుంది. అయితే ఇక్కడి వరకు సమస్యేమీ లేకపోయినా.. దీన్ని మరీ ఎక్కువగా వాడితే చేతులు పొడిబారిపోవడంతో పాటు ఇతర అనారోగ్యాలేమైనా వస్తాయేమో?, ఎంత మోతాదులో వాడచ్చు? అన్న పలు సందేహాలు చాలామందిలో నెలకొన్నాయి. వాటన్నింటినీ తాజాగా సోషల్ మీడియా వేదికగా నివృత్తి చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
శానిటైజర్ ఎంత మోతాదులో వాడాలి?
మనం రాసుకునే శానిటైజర్ అరచేయి, మణికట్టు, వేళ్లు, గోళ్లు.. ఇలా అన్ని భాగాలకు సరిపోయేలా, సమానంగా పరచుకునేలా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వాడిన ప్రతిసారీ అరచేయి నిండా (Palmful) శానిటైజర్ వేసుకొని.. దాన్ని రెండు చేతులతో రుద్దుకుంటూ చేతుల భాగాలన్నింటికీ విస్తరించేలా రాసుకోవాలి. ఈ క్రమంలో శానిటైజర్ పూర్తిగా ఆరిపోయేంత వరకూ రుద్దుతూనే ఉండాలి. ఈ ప్రక్రియంతా పూర్తి కావడానికి సుమారు 20-30 సెకన్ల సమయం పడుతుంది.
ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లు వాడడం మంచిదేనా?
శానిటైజర్లలో ఉండే ఆల్కహాల్ ఎలాంటి ఆరోగ్య సమస్యల్నీ తెచ్చిపెట్టదు. కాబట్టి దీన్ని ఎవరైనా సురక్షితంగా వాడచ్చు. శానిటైజర్ రాసుకున్నప్పుడు ఇందులోని కొద్ది శాతం ఆల్కహాల్ మాత్రమే చర్మంలోకి ఇంకుతుంది. చాలావరకు శానిటైజర్లలో చర్మాన్ని తేమగా, మృదువుగా మార్చే పదార్థం (Emollient) ఉంటుంది. ఫలితంగా చేతుల చర్మం పొడిబారుతుందన్న సమస్య ఉండదు. అలాగే శానిటైజర్ల వల్ల చర్మ సంబంధిత అలర్జీలు.. వంటి సమస్యలు రావడం కూడా చాలా అరుదు!
శానిటైజర్‌ను రోజులో ఎన్ని సార్లు వాడచ్చు?
ఎన్నిసార్లైనా వాడచ్చు. సాధారణంగా ఇతర యాంటీసెప్టిక్స్, యాంటీబయోటిక్స్, హానికారక క్రిముల మాదిరిగా కాకుండా.. ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లు యాంటీబయోటిక్ నిరోధకత (బ్యాక్టీరియా, వైరస్‌లను చంపడానికి తీసుకునే మందులు పనిచేయని స్థితి)ని సృష్టించవు.
ఒకే శానిటైజర్ బాటిల్‌ని ఎక్కువ మంది టచ్ చేస్తే వైరస్ సోకదా?
ఆ అవకాశమే లేదు. ఎందుకంటే బాటిల్‌ను టచ్ చేసినా ఆపై శానిటైజర్‌తో చేతుల్ని శుభ్రం చేసుకుంటారు. తద్వారా ఆ బాటిల్‌కు అంటుకున్న చేతి భాగం కూడా శానిటైజ్ అవుతుంది.. ఈ క్రమంలో అక్కడ అంటుకున్న క్రిములు కూడా నశించిపోతాయి. సూపర్‌మార్కెట్లు, షాపింగ్‌మాల్స్.. వంటి రద్దీ ప్రదేశాల్లో గేటు వద్దే శానిటైజర్‌ని ఉంచితే.. లోపలికి వెళ్లడానికి ముందే ప్రతి ఒక్కరూ చేతులు శానిటైజ్ చేసుకుంటారు.. తద్వారా మాల్‌లోని వస్తువులకు కూడా వైరస్ అంటుకోకుండా.. అది ఇతరులకు సోకకుండా జాగ్రత్తపడచ్చు. ఫలితంగా వైరస్ విస్తరించే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.
చేతులు శానిటైజ్ చేసుకోవడం మంచిదా? గ్లోవ్స్ పెట్టుకోవడం మంచిదా?
గ్లోవ్స్ పెట్టుకోవడం కంటే పదే పదే చేతులు శానిటైజ్ చేసుకోవడమే మంచి పద్ధతి. ఎందుకంటే గ్లోవ్స్ ద్వారా ఒక ప్రదేశంలోని క్రిములు, బ్యాక్టీరియా, వైరస్‌లు మరో ప్రదేశానికి అంటుకునే ప్రమాదం ఎక్కువ. ఇలా వైరస్ విస్తృతి పెరుగుతుంది. ఆపై గ్లోవ్స్ తీసేసే క్రమంలోనూ అవి చేతులకు అంటుకోవచ్చు. కాబట్టి చేతులు శుభ్రం చేసుకోవడానికి ప్రత్యామ్నాయం గ్లోవ్స్ కానే కాదు. అందుకే తరచూ సబ్బు, నీటితో 20 సెకన్ల పాటు చేతులు కడుక్కోవడం, ఆ వీల్లేకపోతే శానిటైజర్ రాసుకోవడం తప్పనిసరి.
సో.. ఇదండీ! శానిటైజర్ వాడకం గురించి మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని నిజాలు! మరి, వీటిని దృష్టిలో ఉంచుకొని తరచూ హ్యాండ్ శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుందాం.. కరోనాకు దూరంగా ఉంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం..!