సంప్రదాయ డిగ్రీ సీట్ల భర్తీ కోసం ప్రత్యేక విడత షెడ్యూలు విడుదలైంది. రేపటి నుంచి ప్రత్యేక విడత ప్రక్రియ ప్రారంభం అవుతుందని దోస్త్ కన్వీనర్, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. రేపటి నుంచి 20వ తేదీ వరకు దోస్త్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొనే అభ్యర్థులు, గతంలో సీటు వచ్చినప్పటికీ కాలేజీలో చేరని వారు రూ.400 చెల్లించాల్సి ఉంటుందని దోస్త్ కన్వీనర్ పేర్కొన్నారు.
ఈనెల 24న ప్రత్యేక విడత డిగ్రీ సీట్ల కేటాయించనున్నారు. ఈ నెల 24 నుంచి 26 వరకు సెల్ఫ్ రీపోర్టింగ్ చేసి కాలేజీల్లో చేరాలి. చేరిన కాలేజీలోనే కోర్సు లేదా మీడియం మార్పు కోసం ఈ నెల 27 నుంచి 29 వరకు ఇంట్రా కాలేజీ ఆప్షన్లు స్వీకరించి.. ఈ నెల 30న సీట్లు కేటాయిస్తారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో బీఏ, బీకాం, బీఏస్సే 19,77,022 డిగ్రీ సీట్ల భర్తీ కాగా.. మరో 2,19,693 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
మూడో విడతలో 73,637 మందికి డిగ్రీ సీట్లు కేటాయించారు. 80,336 మందికి వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. అందులో 55,026 మందికి మొదట కోరుకున్న సీటే దక్కింది. మరో 6,699 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసినప్పటికీ.. సీటు దక్కలేదు. ఈ ఏడాది కూడా కామర్స్‌లో చేరేందుకే ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి కనబరిచారు. కేటాయించిన సీట్లలో 39.43 శాతం కామర్స్ విద్యార్థులకే ఉన్నాయి. ఆ తర్వాత భౌతిక శాస్త్రంలో విద్యార్థులు సీటు పొందారు. ఈ సారి అబ్బాయిలకన్నా అమ్మాయిలే సంప్రదాయ డిగ్రీలో చేరేందుకు మొగ్గు చూపారు.