DK Aruna on CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ పై భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శల వర్షం కురిపించారు. ప్రజలకు కేసీఆర్ ఎప్పుడూ అబద్దాలే చెబుతారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మాటలను కూడా సీఎం కేసీఆర్ వక్రీకరించారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ ఇంతకు ముందు మిత్రుడు.. ఇప్పుడేలా శత్రువయ్యారని ప్రశ్నించారు. మీరు చేసే దోపిడికి అడ్డు చెప్పకుంటే మిత్రుడు... లేదంటే శత్రువా అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి నిలధీశారు. పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి చేయలేదన్నారు.
'తెలంగాణ వచ్చాక ఇక్కడి ప్రజలకు దక్కిందేమీ లేదు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ అప్పులపాలు చేశారు. ప్రాజెక్టుల పేరిట రూ.లక్షల కోట్లు కూడబెట్టారు. దోచుకుని దాచుకోవాలనేదే కేసీఆర్ సిద్ధాంతం. ప్రజలకు అప్పులు మిగిల్చి.. మీరు కోట్లు కూడబెట్టుకున్నారు. రూ.లక్ష కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ల పాలైంది. ఇప్పటివరకు చేసిన అప్పులను కేసీఆర్ చెల్లించాలి.'- డీకే అరుణ, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు
కేసీఆర్ చేసిన మోసాలకు ప్రజలు గద్దె దించాలని చూస్తున్నారని అరుణ పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబమంతా బంగారుమయం అయిందని ప్రజలకు అప్పులు మిగిలాయని ఆరోపించారు. తెరాసకు ఆదరణ దక్కడం లేదని జీర్ణించుకోలేక భాజపా గ్రాఫ్ పెరుగుతుందని తమ నేతలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి విషయంలో జగన్‌తో ఏం ఒప్పందం చేసుకున్నారని ప్రశ్నించిన ఆమె... జగన్‌కు కేసీఆర్ అమ్ముడుపోయాడని విమర్శించారు. అసమర్థ అవినీతి కుటుంబ పాలన చూసి ప్రజలు కేసీఆర్‌ను ఇంటికి పంపేందుకు సిద్ధమయ్యారని తెలిపారు.
ఇవీ చదవండి: