తన ఉదార స్వభావంతో రియల్ హీరోగా పేరు సంపాధించుకున్న సినీ నటుడు సోనూసూద్ జన్మదినం సందర్భంగా ఎంతో మంది ఆయన అభిమానులు వివిధ రూపాల్లో శుభాకాంక్షలు తెలిపారు. కొందరు తమకున్న కళలతో తమ అభిమాన నటునికి బర్త్‌డే విషెస్ తెలిపారు. అందులో యువకుడు తనకు మాత్రమే సొంతమైన అరుదైన కళతో సోనూ చిత్రాన్ని గీసి అందరినీ ఆశ్చర్యపరచటమే కాకుండా.. ప్రపంచ రికార్టులను సైతం సొంతం చేసుకున్నాడు.
విభిన్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు..
సోనూసూద్ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దాసరి యశ్వంత్ అనే కళాకారుడు... వేసిన చిత్రానికి మూడు ప్రపంచ రికార్డుల్లో స్థానం దక్కింది. ఈ విషయాన్ని భారత్ వరల్డ్ రికార్డ్స్ అధ్యక్షుడు లయన్ రమణారావు ధ్రువీకరించారు. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న యశ్వంత్... ప్రముఖ నటుడు, సమాజసేవకుడు, రియల్ హీరో సోనూసూద్‌కు యశ్వంత్ వీరాభిమాని. అతితక్కువ సమయంలో నాలుకతో ఎంతో మంది ప్రముఖుల బొమ్మలు వేయటం దాసరి యశ్వంత్ ప్రాముఖ్యత. అయితే... జులై 30 సోనూసూద్ జన్మదినం సందర్భంగా.. మహరాష్ట్ర ముంబయిలోని ఆయన నివాసానికి చేరుకుని తనకున్న కళతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు యశ్వంత్.


2 నిమిషాల్లోనే సోనూ చిత్రం...
సోనూసూద్‌తో పాటు భారత్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు, ఇతర అభిమానుల సమక్షంలో.. యశ్వంత్ తన నాలుకతో కేవలం 2 నిమిషాల వ్యవధిలోనే సోనూ చిత్రాన్ని వేసి అందరినీ అబ్బురపరిచాడు. సోనూసూద్ చిత్రాన్ని నాలుకతో కేవలం 2 నిమిషాల వ్యవధిలో వేసిన దాసరి యశ్వంత్ పేరును వరల్డ్ రికార్డ్స్, టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ , భారత్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేస్తున్నట్లుగా భారత్ వరల్డ్ రికార్డ్స్ అధ్యక్షులు లయన్ కేవీ రమణారావు వెల్లడించారు.


ఇప్పటికే 12 అవార్డులు..
వినూత్నంగా.. అరుదైన కళతో తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చిత్రకారుడు దాసరి యశ్వంత్‌ను సోనూ అభినందించారు. భవిష్యత్‌లో గొప్ప చిత్ర కళాకారుడిగా ఇంకా ఎన్నో ప్రపంచ రికార్డులు, అవార్డులు అందుకోవాలని సోనూసూద్ ఆకాంక్షించారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, సినీ నటుల చిత్రాలను నాలుకతో గీసిన యశ్వంత్.. ఎంతో మంది ప్రశంసలు పొందారు. అభినందలతో పాటు ఇప్పటి వరకు 12 అవార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అందరికంటే భిన్నంగా.. నాలుకతో చిత్రాలు గీస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోన్న యశ్వంత్ ఖాతాలో మరో మూడు రికార్టులు చేరటంతో యశ్వంత్ ఆనందం వ్యక్తం చేశాడు.
ఇవీ చూడండి: