ఈనెల 30 తర్వాత మరోసారి లాక్‌డౌన్ పొడిగించే అవకాశం లేకుండా... ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. లాక్‌డౌన్ అమలుపై పోలీస్ కమిషనర్లు, జోనల్ ఐజీలు, డీఐజీలు, జిల్లా ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రజలను చైతన్యపరచండి..
ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపు ఉన్నప్పటికీ... ప్రజలు నిత్యావసరాల కోసం 8 గంటల తర్వాతే బయటకు వస్తున్నారని... దీని వల్ల మార్కెట్లు, దుకాణాల వద్ద గుమిగూడాల్సి వస్తోందన్నారు. ఉదయం 6 గంటల నుంచే మార్కెట్లోకి వచ్చి ప్రజలు కొనుగోళ్లు చేసేలా చైతన్యపర్చాలని పోలీసులకు సూచించారు. కూరగాయలు, చేపల మార్కెట్ల వద్ద ప్రజలు గుంపులుగా చేరకుండా... మార్కెటింగ్, మున్సిపల్ శాఖాధికారులతో మాట్లాడి... మార్కెట్లను వికేంద్రీకరించేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ పోలీసు అధికారులకు సూచించారు.
అనుమతి లేకపోతే బండి సీజ్
లాక్‌డౌన్‌ను పర్యవేక్షించేందుకు కమిషనర్ నుంచి ఏసీపీ స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. ఉదయం 10 గంటల అనంతరం అనుమతిలేని వాళ్లు బయటికి వస్తే... వాళ్ల వాహనాలు సీజ్ చేయాలని డీజీపీ సూచించారు. కేవలం ప్రధాన రహదారుల్లోనే లాక్‌డౌన్ అమలు చేయడమే కాకుండా కాలనీలు, అంతర్గత రహదారుల్లోనూ కఠినంగా అమలు చేయాలని... దీనికోసం గస్తీ వాహనాల సిబ్బంది... సైరన్ వేస్తూ కాలనీల్లో తిరగాలనీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు.
రాష్ట్రంలో పెట్రోల్ బంక్‌లను పూర్తిస్థాయిలో తెరిచేందుకు ప్రభుత్వం అనుమతులు జారీచేసిందన్నారు. పెట్రోల్ బంకుల్లో కేవలం అనుమతించిన వాహనాలు, అంబులెన్స్‌లు, ఆక్సిజన్ రవాణా వంటి వాహనాలకు మాత్రమే పెట్రోల్, డీజిల్ నింపాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు.
ఇదీ చూడండి: గాంధీలో కేసీఆర్... రోగులకు ధైర్యం చెప్పిన సీఎం