లాక్‌డౌన్ మినహాయింపు సమయంలో ప్రజలు వందల సంఖ్యలో రైతు బజార్లలో గుమిగూడుతుండడంతో కరోనా వ్యాప్తి భయం పెరుగుతోంది. రోజూ ఉదయం సమయంలో కేవలం 4 గంటలే లాక్‌డౌన్ ఉండదు. దీంతో ఆ వేళలో ప్రజలు పెద్దసంఖ్యలో నిత్యావసరాల కోసం బయటకు వస్తున్నారు. గతేడాది ఏప్రిల్, మే నెలల్లో రైతుబజార్లు దాదాపు మూతపడ్డాయి. ఆ సమయంలో ప్రజల సౌకర్యార్థం మార్కెటింగ్ శాఖ ప్రతి కాలనీకి అందుబాటులో ఉండేలా ‘కూరగాయల విక్రయ కేంద్రాలు’ పేరుతో వాహనాలు ఏర్పాటుచేసింది. పండ్లు, కూరగాయలు వాటిలో విక్రయించారు. దీనివల్ల ప్రజలు బయటికి వచ్చే అవసరం తగ్గింది. ఇప్పుడు కాలనీలకు సంచార విక్రయ కేంద్రాలను ఎందుకు పంపడం లేదనేది ప్రశ్నార్థకంగా మారింది.
దీనిపై మార్కెటింగ్ శాఖ వర్గాలను వివరణ అడగ్గా 80 వాహనాలను కాలనీలకు పంపుతున్నామని చెప్పారు. ఈ వాహనాలను 10 గంటల తరవాత తిరగడానికి పోలీసులు అనుమతించడం లేదని... దీంతో ఇవి కూడా సక్రమంగా తిరగడం లేదని తెలుస్తోంది. ఎన్ని వాహనాలు కాలనీల్లో తిరుగుతున్నాయో, అవి ఎక్కడికి వెళుతున్నాయనేది అధికారులకే తెలియడం లేదు. ప్రజలకు రైతుబజార్ల ధరలకే కాలనీల్లో కూరగాయలు అందించడానికి రెండేళ్ల క్రితం వరకూ మన కూరగాయలు పేరుతో ప్రత్యేక స్టాళ్లు ఉండేవి.కానీ వాటిని అర్థంతరంగా మార్కెటింగ్‌శాఖ రద్దు చేయడంతో కాలనీలకు కూరగాయల పంపిణీ ఆగిపోయింది. దీంతో ఇలాంటి అత్యవసర సమయంలో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లాక్‌డౌన్ మినహాయింపు ఉన్న 4 గంటల వ్యవధిలోనే వేలాది మంది ప్రజలకు కూరగాయలు అందడం కష్టసాధ్యంగా మారింది.
- రాష్ట్రంలో నిత్యావసర సరకులు, కూరగాయలు మార్కెట్లకు లాక్‌డౌన్‌లో ఎలా వస్తున్నాయనే అంశంపై రాష్ట్ర నిత్యావసరాల పర్యవేక్షణ కమిటీ సమీక్ష జరిపింది. అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చకు వచ్చాయి.
- రాష్ట్రంలోని అన్ని రకాల మార్కెట్లకు కలిపి 25,466 క్వింటాళ్ల కూరగాయలు రాగా రైతుబజార్లకు కేవలం అందులో 19 శాతం(4836 క్వింటాళ్లు) మాత్రమే రైతుబజార్లకు వచ్చాయి. కానీ రైతుబజార్లకే జనం పెద్దసంఖ్యలో వస్తున్నారు.
- రాష్ట్రంలో కూరగాయల విక్రయాలపై లాక్‌డౌన్ సరైన ప్రణాళిక కరవైంది. ఉదయం 4 గంటల సమయం మినహాయింపు ఉన్నందున ప్రజలు వారికిష్టమైన చోట కొనుక్కుంటారులే అని మార్కెటింగ్ శాఖ వదిలేసింది. కానీ బయట చిల్లర మార్కెట్లలో ధరలు విపరీతంగా పెంచుతున్నందున ప్రజలు రైతుబజార్లకు ఒకేసారి పోటెత్తుతున్నారు.
- రైతుబజార్లకు కాకుండా బయట చిల్లర మార్కెట్లకే వ్యాపారులు కూరగాయలను ఎక్కువ అమ్ముతున్నారు.
ఉదయం 6 నుంచి 7 గంటల వరకూ జనం పెద్దగా రావడం లేదని, అందరూ ఒకేసారి 7 నుంచి 9 మధ్య వస్తున్నందున రద్దీ ఎక్కువగా ఉంటోందని రైతుబజార్ల రాష్ట్ర ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) రవికుమార్‌కు చెప్పారు. ఉదయం 6 నుంచి 7 గంటలకే వస్తే రద్దీ లేకుండా తాజా కూరగాయలు దొరుకుతాయని రైతుబజార్లలో మైకుల ద్వారా తరచూ ప్రకటిస్తున్నా ప్రజల్లో మార్పు రావడం లేదన్నారు. సంచార విక్రయ కేంద్రాలను 10 గంటల తరవాత పోలీసులు తిరగడానికి అనుమతించకపోవడం వల్ల పూర్తిస్థాయిలో ఉపయోగపడడం లేదని వివరించారు.