Uppal-Narapally FlyOver : గుత్తేదారు వేగం పెంచరు.. బల్దియా ఆమోదం చెప్పదు - delay in uppal narapally flyover works
అది నిర్మాణంలో ఉన్న కీలకమైన ఆకాశమార్గం.. గుత్తేదారు అసక్తత వల్ల రెండేళ్లుగా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. ఇప్పుడు జీహెచ్‌ఎంసీ రంగప్రవేశం చేసి ఈ మార్గాన్ని మరింత పొడిగించే ప్రతిపాదన చేసింది. దీనిపై తుది నిర్ణయం వెల్లడించకపోవడంతో ఈ వంతెన నిర్మాణం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రతి రోజూ లక్ష వాహనాలు తిరిగే ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్లే జాతీయ రహదారిలో నిర్మిస్తున్న ఆరు వరుసల ఫ్లైఓవర్(Uppal-Narapally FlyOver) కథ ఇది. పిల్లర్ల వల్ల ఇప్పటికే రోడ్డు కుంచించుకుపోవడంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఉప్పల్ - నారపల్లి పైవంతెన(Uppal-Narapally FlyOver) పనులు నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్ల క్రితం ప్రారంభమైన పనులు.. ఇప్పటికీ సా...గుతూనే ఉన్నాయి. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ఈ మార్గాన్ని మరింత పొడిగించేందుకు ప్రతిపాదన చేసింది. కొత్త ప్రతిపాదనకు బల్దియా ఆమోదం చెప్పకపోవడం.. పనుల్లో గుత్తేదారులు వేగం పెంచకపోవడం వల్ల ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు.
స్లాబ్ వేయాలంటే ఎన్ని నెలలో..
ఉప్పల్ చౌరస్తా నుంచి బోడుప్పల్ మీదుగా నారపల్లి దగ్గరలోని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వరకు అంటే 7 కిలోమీటర్ల పొడవున మరో పెద్ద ఆకాశమార్గం నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఒక్కోవైపు మూడేసి లైన్ల చొప్పున ఆరు లైన్ల నిర్మాణం చేస్తున్నారు. కేంద్ర రోడ్ల శాఖ ఈ నిర్మాణం కోసం రూ.623 కోట్లను మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ మార్గంలో రోజుకు లక్ష వాహనాలు తిరుగుతున్నాయని రాష్ట్ర రహదారుల శాఖ గుర్తించింది. రెండేళ్ల కిందట టెండర్లను పిలిచి ఓ కంపెనీకి పనులు అప్పగించారు. అయితే తొలినుంచి గుత్తేదారు సంస్థ నెమ్మదిగా పనులు చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటివరకు 130 పిల్లర్ల మధ్య వయాడక్ట్‌లు పూర్తి చేశారు. ఇంకా సుమారు 900ల పిల్లర్ల మధ్య ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికే గుత్తేదారు సంస్థకు రహదారుల శాఖ పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు పైవంతెనను ఉప్పల్ రింగ్‌రోడ్డు వరకు కాకుండా అక్కడి మెట్రో లైను మీదుగా రామంతాపూర్ వరకు తీసుకువెళ్లాలని బల్దియా అధికారులు కొన్నాళ్ల కిందటే ప్రతిపాదించారు. దీనివల్ల రింగ్‌రోడ్డు వద్ద ట్రాఫిక్ భారం తగ్గుతుందని భావించారు. ఈ ప్రతిపాదనపై బల్దియా ఎటూ తేల్చక పోవడంతో రింగ్ రోడ్డు దగ్గర పైవంతెన పనుల్లో జాప్యం జరుగుతోందని రహదారుల శాఖ అధికారులు చెబుతున్నారు.
నిర్ణీత సమయంలో పూర్తి చేస్తాం
" వరంగల్ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్‌ను వేగంగా పూర్తి చేయాలని ఇప్పటికే గుత్తేదారు సంస్థను ఆదేశించాం. కీలకమైన అన్ని స్తంభాల నిర్మాణాన్ని పూర్తి చేశాం. వాహనదారులకు ఇబ్బంది ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు."
- ఐ.గణపతిరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ