ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. వాటికి అనుగుణంగానే ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అవసరాలూ పెరుగుతున్నాయి. అయితే... ఆసుపత్రుల్లో ప్రాణవాయువు సరఫరా వ్యవస్థలో పలు లోపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారులకూ సవాళ్లు ఎదురవుతున్నాయి. వార్డుల్లో పైపులైన్ల ఏర్పాటులోనూ జాప్యం జరుగుతోంది. వివిధ సమస్యలను అధికారులు ముందస్తుగా గుర్తించి, పరిష్కారానికి అడుగులు వేసినా... పనుల్లో వేగం మందగించింది.
ఆసుపత్రుల్లో పది నుంచి 15 పడకలకు చొప్పున వైరస్ బాధితులకు ఒకేసారి పైపులైన్ ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు. ఈ పైపులైన్ల వ్యవస్థ పనితీరుపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో వృథా పెరుగుతోంది. అమర్చిన మాస్కును రోగులు తీసేస్తున్నా, వారు మరుగుదొడ్డికి వెళ్లినా ఆక్సిజన్ సరఫరా మాత్రం కొనసాగుతుండటంతో సరాసరిన 30% వరకు వృథాకు దారి తీస్తోందని, బాధితులు సహకరిస్తే ఈ సమస్య తీరుతుందని ఓ ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. అవసరం లేని వారు సైతం తమకు ఆక్సిజన్ పెట్టాలంటూ వైద్యులపై ఒత్తిడి తెస్తుండటం మరో సమస్యగా మారింది.
విశాఖ నుంచి ఒంగోలుకి రావాలంటే...!
గుత్తేదారులకు ఆక్సిజన్ ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్, బళ్లారి తదితరచోట్ల నుంచి సరఫరా అవుతోంది. బళ్లారి నుంచి తీసుకురావడంలో తరచూ ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక అవసరాల దృష్ట్యా అభ్యంతరాలు చెబుతుండటమే ఇందుకు కారణం. ఇక విశాఖ నుంచి ఒంగోలు జీజీహెచ్‌కు ఆక్సిజన్ రావడంలోనూ ఆలస్యమవుతోంది. చివరి నిమిషంలో కాకుండా కనీసం 6 గంటల ముందు సమాచారం ఇచ్చిపుచ్చుకునేలా రాష్ట్రంలో పక్కా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
పెరిగిన వినియోగం!
ప్రస్తుతం అన్ని ఆసుపత్రులకు కలిపి రోజుకు 130 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా జరిగేలా చేస్తున్నారు. కానీ... తాజా పరిస్థితులకు తగినట్లుగా కనీసం 200 మెట్రిక్ టన్నుల ప్రాణవాయువు అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరముందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాకినాడ జీజీహెచ్‌లో ఇంతకుముందు 20 వేల లీటర్ల ఆక్సిజన్ ప్లాంటును ఒకసారి నింపితే నాలుగు రోజులపాటు వచ్చేది. ప్రస్తుతం ఒకటిన్నర రోజులే వస్తోంది. ఇలా పెరుగుతున్న అవసరాలను రెండు నెలల ముందే గుర్తించి, సామర్థ్యాన్ని పెంచడానికి చేపట్టిన పనులు సైతం చాలాచోట్ల నెమ్మదిగా సాగుతుండటం గమనార్హం.
రోగికి 24 గంటలపాటు ఆక్సిజన్ ఇస్తే..
ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లను గుత్తేదారులు సరఫరా చేస్తున్నారు. ఏ ఆసుపత్రికి ఎంత పరిమాణంలో అవసరమనే దానిని కిలో లీటర్లలో (కేఎల్) కొలుస్తున్నారు. ఒక కిలోలీటరు అంటే వెయ్యి లీటర్లు. ఒక కేఎల్... 100 నుంచి 110 సిలిండర్లతో (డి-టైపు) సమానం. ఒక సిలిండర్‌లో 7 క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ ఉంటుంది. ఐసీయూలోని ఒక రోగికి 24 గంటలపాటు ఆక్సిజన్ ఇస్తే... రెండున్నర సిలిండర్ల (17 క్యూబిక్ మీటర్లు) అవసరం ఉంటుంది. అదే నాన్ ఐసీయూలో అయితే ఒకటిన్నర సిలిండర్లు (10 క్యూబిక్ మీటర్లు) సరిపోతాయి.
పలు జిల్లాలో ఇదీ పరిస్థితి...
- చిత్తూరు జిల్లా పలమనేరు, శ్రీకాళహస్తి ఆసుపత్రి, ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో ఆక్సిజన్ పైపులైన్లకు సంబంధించిన పనులు నత్తనడకన సాగుతున్నాయి.
- పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, తణుకు ఏరియా ఆసుపత్రుల్లో 1 కేఎల్ ట్యాంకులను, అనంతపురం జిల్లా హిందూపురం ఆసుపత్రిలో 6 కేఎల్ ట్యాంకు ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. ఏలూరు ఆశ్రం వైద్య కళాశాలలో 36 గంటలకు సరిపోయే ఆక్సిజన్ మాత్రమే అందుబాటులో ఉంటోంది.
- శ్రీకాకుళం జిల్లా రాజాం, పాలకొండ ఏరియా ఆసుపత్రుల్లో 1 కేఎల్ ట్యాంకుల ఏర్పాటు ఇంకా పూర్తికాలేదు. ప్రకాశంలోని మార్కాపురం జిల్లా ఆసుపత్రిలోనూ ఇదే సమస్య.
- కడప రిమ్స్‌లో పైపులైను ఏర్పాటుకు అవసరమైన పరికరాలు కోల్‌కతా, గుజరాత్‌ల నుంచి రావడంలో జాప్యం జరిగింది.
- నెల్లూరు జీజీహెచ్‌లో ప్రస్తుతం 10 కేఎల్ ట్యాంకు అందుబాటులో ఉంది. ఇక్కడ మరో 10 కేఎల్ ట్యాంకు అవసరముంది.
- కాకినాడ జీజీహెచ్‌లోనూ ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ మెరుగుపడాల్సి ఉంది. వార్డుల్లోకి అవసరమైన పైపులైన్ల ఏర్పాటు ఇంకా కొనసాగుతోంది. రాజమహేంద్రవరం ప్రభుత్వ కొవిడ్ ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన 6వేల లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంటు ప్రస్తుత పడకలకు సరిపోవడంలేదు. రోజుకు రెండుసార్లు విశాఖపట్టణం నుంచి ట్యాంకర్లలో ఆక్సిజన్‌ను తెచ్చి నింపుతున్నారు. ఒకవేళ ప్లాంటు నిండుకుంటే... ప్రత్యామ్నాయ సిలిండర్లను ప్రతి 2 గంటలకు ఒకసారి మార్చాలి. ఇలా మార్చాల్సి వచ్చినప్పుడు జాప్యం అనివార్యం అవుతోంది.
కొత్త ట్యాంకుల ఏర్పాటుకు నిర్ణయం..
చిత్తూరు జిల్లా రుయాలో, విజయనగరం మిమ్స్‌లో 10 కేఎల్ చొప్పున, విశాఖపట్నంలోని ఆంకాలజీ బ్లాకులో 20 కేఎల్, ఛాతీ హాస్పిటల్‌లో 10 కేఎల్ ట్యాంకులు ఏర్పాటుకు నిర్ణయించారు. నంద్యాలలో 2 కేఎల్, ఆదోనిలో 1 కేఎల్, గుంటూరు జీజీహెచ్‌లో 20 కేఎల్, కడప జిల్లా ఫిమ్స్, ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో ఆరు కేఎల్ చొప్పున, పులివెందుల ఏరియాలో ఒక కేఎల్ ట్యాంకులనూ ఏర్పాటు చేయనున్నారు.
ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దశల వారీగా.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి 31,589 పైపులైన్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. వాటిలో 26,250 పైపులైన్లు పూర్తవగా 5,339 పైపులైన్ల నిర్మాణం కొనసాగుతోంది. బాధితులు అవసరం లేకున్నా ఆక్సిజన్ అందించాలని ఒత్తిడి చేస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి రాయలసీమ, ఇతర ప్రాంతాలకు ఆక్సిజన్ రావడంలో ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి.
ఇదీ చదవండి: కరోనా చికిత్సకు అధిక ఫీజుల వసూళ్లపై హైకోర్టులో వ్యాజ్యం