Dalit Bandhu Vehicles: రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంలో మంజూరైన వాహనాలు దళారులు, అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దళితబంధు పథకం కింద ఇచ్చే వాహనం, యంత్రాల క్రయవిక్రయాలపై అయిదేళ్ల పాటు నిషేధం విధించింది. వాటన్నింటినీ ఎస్సీ కార్పొరేషన్‌కు తాకట్టులో పెట్టనుంది. దళితబంధు కింద పొందిన వాహనాలను లబ్ధిదారులు భారీ సంఖ్యలో విక్రయిస్తుండటంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయిదేళ్ల తరువాత కూడా లబ్ధిదారు జిల్లా కలెక్టరు నుంచి నిరభ్యంతర పత్రం తీసుకుంటేనే వాహన విక్రయానికి రవాణాశాఖ అనుమతించనుంది. రాష్ట్రంలో దళితబంధు పథకం కింద ఇప్పటివరకు 26 వేల యూనిట్లు మంజూరయ్యాయి. ఒక్క హుజూరాబాద్‌లోనే 17 వేల మంది లబ్ధిదారులుగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు కార్లు, టిప్పర్లు, జేసీబీలు, వరికోత యంత్రాలు, ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. గతంలో సంక్షేమ పథకాలు మంజూరైనప్పుడు కొందరు అక్రమార్కులు, దళారులు లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకే యూనిట్లు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లబ్ధిదారుల ఆర్థిక అవసరాలు, పేదరికాన్ని ఆసరాగా చేసుకుని వాటిని పక్కదారి పట్టించారు. దళితబంధు పథకంలో ఈ సమస్యలు రాకుండా ఉండాలని ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఒక్కో కుటుంబం రూ.10 లక్షల యూనిట్‌తో ఆర్థిక స్వావలంబన సాధించాలన్న లక్ష్యంతో పథకం ప్రవేశపెట్టినందున లబ్ధిదారులు మంజూరైన యూనిట్లతో ఆదాయం పొందేలా నిబంధనలు చేర్చింది.
క్షేత్రస్థాయిలో పరిశీలనలు.. మరోవైపు దళితబంధు పథకం కింద ఎంపికైన లబ్ధిదారుల సామాజిక, ఆర్థిక అభివృద్ధిని అధికారులు పరిశీలిస్తున్నారు. యూనిట్ మంజూరైన తరువాత ఎంతమేరకు ఆదాయం పొందుతున్నారు? పశువులు, ఇతర జీవాల ద్వారా ఆదాయం ఎలా ఉంది? వాహనాలతో రోజుకు ఎంత సంపాదిస్తున్నారు? తదితర వివరాలను ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో సమీకరిస్తున్నారు.
ఈ ఏడాదికి త్వరలో ఎంపికలు.. రాష్ట్రంలో దళితబంధు పథకం కింద ఈ ఏడాదికి నియోజకవర్గానికి 1500 మంది చొప్పున లబ్ధిదారుల ఎంపికను త్వరలో మొదలు పెట్టాలని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. ఈ పథకంలో నిత్యావసరాలైన పాల ఉత్పత్తిని పెంచేందుకు డెయిరీలు, మినీ డెయిరీలను ప్రోత్సహించాలన్నారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ.3100 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. 36,265 యూనిట్లు మంజూరు చేయగా, 28,970 యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయని, మిగతా వాటిని త్వరలో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
శుక్రవారమిక్కడ ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల సమావేశాలో మాట్లాడారు. దళితబంధును ఉద్యమస్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని, వృత్తి నైపుణ్యం, ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడే యూనిట్లకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సమావేశంలో కార్పొరేషన్ ఛైర్మన్ బండా శ్రీనివాస్, ఎమ్మెల్యే చందర్, సలహాదారు లక్ష్మారెడ్డి, ఎండీ కరుణాకర్, జీఎం ఆనంద్‌కుమార్ పాల్గొన్నారు.
ఇవీ చదవండి: