సైబరాబాద్ పోలీసుల వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమవుతోంది. ఇన్‌స్పెక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఓ మహిళా కానిస్టేబుల్ రాసిన లేఖ.. మరోవైపు ఇంకో అధికారి సివిల్ తగాదాల్లో చూపించిన అత్యుత్సాహం సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
భూ వివాదానికి సంబంధించి ప్రత్యర్థి వర్గం భయభ్రాంతులకు గురి చేస్తోదంటూ బాధితులు డయల్ 100కి కాల్ చేశారు. ఆ ఫిర్యాదు ఎవరు చేశారో తెలుసుకుని ప్రత్యర్థులు అతనిపై దాడికి పాల్పడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఆ సమాచారాన్ని సదరు సీఐ ప్రత్యర్థులకు చేరవేసినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాకుండా మరో రెండు, మూడు ఘటనలు కూడా ప్రస్తుతం వెలుగులోకొచ్చాయి. ఆ ఠాణా పరిధిలోని ఓ గ్రామంలో బాధితులు చాలా కాలం కిందట భూములు కొనుగోలు(సాదా బైనామా) చేశారు. తమ పేరుపై పట్టా చేయాలంటూ రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ధరలు భారీగా పెరగడంతో అసలు మేం భూములు అమ్మలేదంటూ అవతలి వైపు వ్యక్తులు ఎదురు తిరిగారు. ఈ వ్యవహారంలో ఆ సీఐ కల్పించుకుని ‘సెటిల్’ చేసుకోవాలంటూ బాధితులను బెదిరించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. మరోచోట వివాదంలో ఉన్న భూముల దగ్గరికెళ్లి బాధితులను భయభ్రాంతులకు గురి చేసి దగ్గరుండి సరిహద్దు రాళ్లను పాతించినట్లు ఆరోపిస్తున్నారు.
గతంలోనే ఈ ఠాణా పేరు
ఇప్పుడే కాదు.. గతంలోనూ ఈ ఠాణా పేరు మార్మోగింది. ఇతని కంటే ముందు పనిచేసిన ఇన్‌స్పెక్టర్ ఏకంగా స్టేషన్‌లోనే లంచం తీసుకుంటూ అనిశా అధికారుల వలకు చిక్కడం సర్వత్రా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా అతని ‘సెటిల్‌మెంట్’ బాధితులు బయటికొచ్చి ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు కంగుతిన్నారు. ఆయన స్థానంలో ఆరు నెలల కింద ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ బాధ్యతలు స్వీకరించారు. సైబరాబాద్ పరిధిలోని కొందరు ఇన్‌స్పెక్టర్లు ‘భూదందా’లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఇటీవల గుప్పుమంటున్నాయి. సంబంధిత ఉన్నతాధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటంతోనే దర్జాగా సివిల్ సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారు.