లాక్డౌన్ను పొడిగించారనే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల కూలీలు... స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. అలాంటి చర్యలను విరమించుకోవాలని కోరారు. వలస కూలీలు, కార్మికులందరికీ ప్రభుత్వం ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశామని సీపీ పేర్కొన్నారు. ఏమైనా సమస్యలుంటే పోలీసులను, లేదంటే జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదించాలని సూచించారు.
వలస కూలీలు కాలినడకన వెళ్లే సమయంలో చిన్న పిల్లలతో ప్రయాణం చేస్తున్నారన్న సీపీ.. దీనివల్ల ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందన్నారు. ఎండ తీవ్రతకు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని హెచ్చరించారు.
లాక్డౌన్పై ఎలాంటి అపోహలు, అనుమానాలు లేకుండా ఎక్కడి వారు అక్కడే ఉండాలని కోరారు. ప్రజలకు, కూలీలకు, వలసజీవులకు యంత్రాంగమంతా అందుబాటులో ఉంటుందని భరోసానిచ్చారు. దేశం మొత్తం ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతోందని.. స్వస్థలాలకు వెళ్లినా అక్కడ కూడా ఇంట్లోనే ఉండాల్సిందేనని గుర్తుచేశారు.
కార్మికుల బాగోగులు చూసుకోవాలని భవన నిర్మాణ, పరిశ్రమల యాజమాన్యాలకు సూచించామని.. బేఖాతరు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు.
ఇవీచూడండి: దయనీయ స్థితిలో వలస కూలీ... కడుపు ఖాళీ