రాష్ట్రంలోని నగరాలు, పురపాలక పట్టణాల్లో ఈ నెల 15వ తేదీ నాటికి 10,915 ప్రజా మరుగుదొడ్లు అందుబాటులోకి వస్తాయని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్ ప్రకటించారు. ప్రతి వెయ్యిమందికి ఒక పబ్లిక్ టాయిలెట్ సముదాయం నిర్మించాలనే కార్యాచరణతో ఈ కార్యక్రమం అమలవుతోందని తెలిపారు. కొత్తగా నిర్మించే వాటిలో 50 శాతం మహిళల కోసం కేటాయించనున్నట్టు వివరించారు. చాలా పట్టణాల్లో పాత ఆర్టీసీ బస్సులను మహిళల కోసం సంచార టాయిలెట్లుగా ఉపయోగిస్తున్నారని తెలిపారు.
‘హైదరాబాద్ నగరంలోనే 7,065 అందుబాటులో వస్తాయి. వీటిలో 20 శాతం బీవోటీ విధానంలో నిర్మించినవి. మిగిలినవి నిర్వహణ విధానంలో ఉంటాయి. 139 నగరాలు, పురపాలక పట్టణాల్లో 3,850 మరుగుదొడ్ల నిర్మాణం 15వ తేదీ లోపు పూర్తవుతుంది. నిర్మాణ నమూనా ఆధారంగా ఒక్కో దానికి రూ.60 వేల నుంచి రూ.1.5 లక్షలు వ్యయం చేస్తున్నాం’ అని అర్వింద్‌కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: 'కోజికోడ్ విమానాశ్రయ రన్‌వే సురక్షితమైనదే'