chada on kcr: వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి తెలిపారు. వానాకాలంలో కేంద్రం.. వరి ధాన్యాన్ని కొనుగోలు చేసినా, చేయకపోయినా మొత్తం పంటను కొనుగోలు చేస్తామని సీఎం ప్రకటించడం మంచి పరిణామమన్నారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటనలకు.. కేంద్ర ప్రభుత్వ వైఖరికి అసలు పోలికే లేదన్నారు. తెలంగాణ నుంచి ఎంత మొత్తంలో ధాన్యం కొనుగోలు చేస్తారో చెప్పకపోవడం దారుణమన్నారు. ఇలాంటి వైఖరి రైతులను మరింత అయోమయంలోకి నెట్టుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
యాసంగిలో అసలు కొనుగోళ్లు కేంద్రాలు ఉండవన్న సీఎం ప్రకటన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చాడ అభిప్రాయపడ్డారు. అందుకు సంబంధించిన ప్రణాళిక తయారుచేయాలని కోరారు.
'తెలంగాణ నుంచి ఎంత ధాన్యం కొంటారో చెప్పకపోవడం దుర్మార్గం. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటనలకు.. కేంద్ర ప్రభుత్వ వైఖరికి పోలికే లేదు. కేసీఆర్ ప్రకటన కేంద్ర ప్రభుత్వ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసింది. సీఎం ప్రకటనను స్వాగతిస్తున్నాం.'-చాడ వెంకట్రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
కేసీఆర్ ప్రకటనేంటి..
రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలపై.. సోమవారం(నవంబర్ 29) సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందన్న సీఎం.. ఎంత పోరాడినా ఒప్పుకోవట్లేదని తెలిపారు. ధాన్యం పండించి రైతులు నష్టపోవద్దనే ధైర్యంగా ప్రకటన చేస్తున్నామన్న కేసీఆర్.. యాసంగి పంటకు కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేశారు.
ఇదీచూడండి: CM KCR ON YASANGI: 'యాసంగిలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు'