కరోనా కట్టడికి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, అనవసర ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత అప్రమత్తం చేస్తున్నా.. ప్రజలు కొంత మంది ఏమాత్రం లెక్కచేయడం లేదు. ఫలితంగా కరోనా వ్యాప్తికి కారకులవుతున్నారు. బస్సులు, రైళ్లు, ఇతర వాహనాల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకుండానే ప్రయాణిస్తున్నారు. కరోనా రెండో దశలో విజృంభిస్తున్నా.. వారిలో ఏ మార్పు రావడం లేదు.
అన్ని చోట్లా ఉల్లంఘనలే..
సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో.. ఎక్కడ చూసినా మాస్కులు లేకుండానే గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. జేబీఎస్, ఎంజీబీఎస్, సిటీ బస్టాపుల్లోనూ మాస్కులు లేకుండానే ప్రయాణిస్తున్నారు. ఆటోస్టాండ్లలోనూ ఇటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఆటో, బస్సు డ్రైవర్లు, కండక్టర్లలో చాలా మంది మాస్క్లు లేకుండానే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇది ప్రయాణికులకూ ఇబ్బందికరంగా మారుతోంది.
'ఉమ్ము వస్తుందని తీసేశాం..'
మాస్కు ఎందుకు పెట్టుకోవడం లేదని ప్రశ్నించే అధికారులకు.. ఉమ్ము వస్తుందని తీసేశాం.. ఉపశమనం కోసం ఇప్పుడే తీశామంటూ చాలా నిర్లక్ష్యంగా బదులిస్తున్నారు. మరికొందరు ప్రయాణికులైతే మర్చిపోయి వచ్చామంటున్నారు. ఇంకొందరు మాస్కు పెట్టుకున్నా.. గడ్డం వద్దే వదిలేస్తున్నారు. మరికొందరు మాస్కు ఎందుకు పెట్టుకోలేదని అడిగితేనే పెట్టుకుంటున్నారు. మిగతా సందర్భాల్లో చేతిరుమాలు మాదిరిగా జేబులోనే ఉంచుకుంటున్నారు.
జరిమానాలు విధిస్తున్నా..
ఉద్ధృత రూపం దాల్చుతున్న కరోనాని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఓ పక్క మాస్కులు ధరించాలని అవగాహన కల్పించడం సహా జరిమానాలు విధిస్తున్నారు. అయినా ప్రజల్లో ఏమాత్రం మార్పురావడం లేదు.
ఇవీచూడండి: