కరోనాతో ఖజానాకు గండి పడటంతో ఆ ప్రభావం సాగునీటి ప్రాజెక్టుల పనులపై పడింది. నిర్మాణంలో ఉన్న ప్రధాన ప్రాజెక్టులతో సహా మిగిలిన వాటికి నామమాత్రంగానే ఖర్చు చేశారు. కొన్నింటికి అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూపాయి చెల్లించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటివరకు రూ.800 కోట్లు వ్యయం చేయగా, ఇందులో రాష్ట్ర ఖజానా నుంచి ఇచ్చింది రూ.155 కోట్లు మాత్రమే. మిగిలింది బ్యాంకు రుణం నుంచి చెల్లించినదే.. సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లలో భారీగా ఖర్చు చేసింది.
ఆ ప్రభావం పడింది
ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపు, బ్యాంకుల నుంచి తీసుకొనే రుణం కలిపి రూ.20 వేల కోట్లకు పైగా వ్యయం చేయాలని నిర్ణయించింది. సాధారణంగా జూన్ వరకు నిర్మాణ పనులు వేగంగా జరుగుతాయి. ఈ సమయంలో ప్రాజెక్టులపై చేసే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కరోనా, లాక్‌డౌన్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోవడంతో ఆ ప్రభావం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై పడింది.
‘కాళేశ్వరం’లో రూ.5 వేల కోట్ల పెండింగ్
పెండింగ్ బిల్లులు అధికంగానే ఉన్నాయి. ఈ నెల 8 వరకు రూ.12 వేల కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉండగా, ఇందులో అత్యధికంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోనే రూ.5 వేల కోట్లకు పైగా ఉన్నాయి. తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో రూ.17 వేల కోట్లున్నాయి. కల్వకుర్తి, దేవాదుల, ఎల్లంపల్లి, సీతారామ, డిండి ఎత్తిపోతలతో పాటు చిన్ననీటి వనరులకు భారీగా చెల్లించాల్సి ఉంది.
డిసెంబరు కల్లా లక్ష్యం
కాళేశ్వరం ఎత్తిపోతల నుంచి మూడో టీఎంసీ నీటిని మళ్లించే లిప్టు పనులు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో చురుగ్గా జరుగుతున్నాయి. మధ్యమానేరు దిగువన ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే డిస్ట్రిబ్యూటరీలు, ఇతర పనులను నిర్వహిస్తున్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం పనులను ఈ డిసెంబరు కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేవాదుల మూడో దశ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ సమయంలో నిధుల సమస్య ఈ పనుల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: 10 గ్రేడ్లపై ముమ్మర కసరత్తు .. విద్యార్థుల్లో టెన్షన్ టెన్షన్