కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఆయన ఎన్ఎస్యూఐ కార్యకర్తగా రాజకీయ అరగ్రేటం చేసి... గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా అంచెలంచెలుగా ఎదిగారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్ నుంచి రాష్ట్ర మంత్రిగా సేవలందించారు. ముఖేశ్ గౌడ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
రాజకీయ ప్రస్థానం
ముఖేశ్ గౌడ్ 1959 జులై 1న హైదరాబాద్‌లో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ పట్టా పొందారు. విద్యార్థి దశ నుంచే ముఖేశ్ గౌడ్ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించేవారు. కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ తరఫున విద్యార్థి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. క్రమంగా కాంగ్రెస్‌లో క్రియాశీల కార్యకర్తగా పనిచేశారు. యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు.
కార్పొరేటర్ నుంచి మంత్రిగా
జాంభాగ్ డివిజన్ కార్పొరేటర్‌గా ప్రజా జీవితం ప్రారంభించిన ముఖేశ్ గౌడ్... మహరాజ్‌గంజ్ నుంచి 1989లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎంఐఎం హవా నడిచే మహరాజ్ గంజ్ నుంచి 2004లో మరోసారి విజయం సాధించారు. 2009 లో గోషామహాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో బీసీ సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. 2010 నుంచి 2014 రాష్ట్ర విడిపోయే వరకూ మార్కెటింగ్‌శాఖ మంత్రిగా కొనసాగారు.
ఇదీ చూడండి :మాజీమంత్రి ముఖేశ్‌గౌడ్ కన్నుమూత