రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆగ్రహంతో ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను తెరాస ఎల్పీలో విలీనం చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో సమస్యలను గాలికొదిలేసి కేవలం ఎమ్మెల్యేల కొనుగోలుపై కేసీఆర్ దృష్టి పెట్టారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, మాజీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. తెరాస వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా రేపు ఉదయం 11 గంటలకు సేవ్ డెమోక్రసీ పేరుతో 36 గంటల దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు.
హైకోర్ట్, లోక్‌పాల్...
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా.. విలీనం లేఖను ఎలా తీసుకుంటారని స్పీకర్‌ను కాంగ్రెస్ నేతలు నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ తెరాసలో ఎలా విలీనం జరుగుతుందని ప్రశ్నించారు. పైలెట్ రోహిత్ రెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి, హర్ష వర్ధన్ రెడ్డిలను ప్రలోభాలకు గురిచేసి తెరాసలోకి బలవంతంగా చేర్చుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. అక్కడ వచ్చే ఫలితం ఆధారంగా సుప్రీంకు వెళ్తమన్నారు. లోక్‌పాల్‌లో కూడా ఫిర్యాదు చేసి, ఆధారాలతో సహా నిరూపించి కేసీఆర్‌ను గద్దె దించుతామన్నారు.
బ్లాక్ డే
తెరాసలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను విలీనం చేసిన రోజును బ్లాక్ డేగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ అభివర్ణించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని దుయ్యబట్టారు. కార్యకర్తలు ఎవరు భయపడొద్దని తాము అండగా ఉంటామని హస్తం నేతలు భరోసా ఇచ్చారు.
ఇవీ చూడండి: సీఎల్పీ విలీనం పూర్తి... ప్రతిపక్ష హోదా గల్లంతు