పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం చేస్తామని ప్రకటించారు. ఈ నెల 28న గాంధీ భవన్ నుంచి ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు ఫ్లాగ్ మార్చ్ చేస్తామని తెలిపారు. వచ్చే వారం రోజులపాటు ప్రతి గ్రామంలో సీఏఏకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఉత్తమ్ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంటులో వ్యతిరేకించిన తెరాస, ఎంఐఎంలు తమ వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. తెలంగాణలో ఆ చట్టాన్ని అమలు చేయెద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ట్యాంకుబండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సీఏఏ, ఎన్ఆర్సీలకి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ దక్షిణ భారత దేశ సమన్వయకర్త, మాజీ మంత్రి గీతా రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీలకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని గీతారెడ్డి స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం తక్షణమే పౌరసత్వ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ఆందోళనకారుల పట్ల పోలీసుల అనుచిత వైఖరి ప్రదర్శిచడం సరికాదని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. విశ్వవిద్యాలయాల్లో పోలీసు బలగాల మోహరింపును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28న గాంధీ భవన్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇదీ చూడండి: ఆకట్టుకున్న కంబైన్డ్ పాసింగ్ పరేడ్.. విమానాల విన్యాసాలు