హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల బరిలో నిలబడే కాంగ్రెస్ అభ్యర్ధుల ఎంపిక ఇవాళ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. లోకసభ నియోజకవర్గాల వారీగా అభ్యర్ధుల ఎంపికపై ప్రత్యేకంగా ఏర్పాటైన కమిటీలు... అన్నీ నిన్న సమావేశం కాలేకపోయాయి. హైదరాబాద్, మెదక్ లోకసభ నియోజకవర్గాలకు చెందిన కమిటీలు మాత్రమే గాంధీభవన్‌లో నిన్న సమావేశం అయ్యాయి. ఇవి కూడా పూర్తి స్థాయిలో చర్చించలేక పోయాయి. అసంపూర్తిగానే ముగిశాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రత్యేక కమిటీలు, సమన్వయకర్తలు సమావేశమై అభ్యర్ధుల ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేసే అవకాశం ఉంది. అయిదు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో 150 డివిజన్లతో కూడిన 23 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.
మరింత ఆలస్యం!
మెదక్ లోకసభ స్థానం పరిధిలో అతి తక్కువగా మూడు డివిజన్లు మాత్రమే ఉన్నాయి. పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గంలోని మూడు డివిజన్లే ఉన్నందున రేపు సాయంత్రానికి అభ్యర్ధుల ఎంపిక పూర్తయ్యే అవకాశం ఉంది. చేవెళ్ల లోకసభ పరిధిలోకి మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 18 డివిజన్లు ఉన్నాయి. దీంతో ఈ పార్లమెంటు నియోజకవర్గంలో కూడా అభ్యర్ధుల ఎంపిక త్వరితగతిన పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి లోకసభ నియోజక వర్గాల్లో అత్యధికంగా డివిజన్లు ఉండడం వల్ల అభ్యర్ధుల ఎంపిక మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతుతున్నాయి.
రేవంత్ ముందుచూపు..
మల్కాజిరిగిరి నియోజకవర్గంలో ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల ఎంపిక ఎంపీ రేవంత్ రెడ్డి ఇప్పటికే కొంతమేర పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా... ఇవాళ సాయంత్రానికి ఈ నియోజకవర్గంలో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 45 డివిజన్లు ఉండగా... అందులో మూడో వంతు డివిజన్లకు అభ్యర్ధుల ఎంపిక ముందే జరిగిపోయిందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
సమష్ఠిగా పనిచేయాల్సిందే..
ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో... బలమైన నాయకుడినే బరిలో దింపాల్సి ఉన్నందున అభ్యర్ధుల ఎంపికపై భారీ కసరత్తు చేయాల్సి ఉంటుందని కాంగ్రెస్ శ్రేణులే పేర్కొంటున్నాయి. కానీ ఇవాళ్టి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానున్నందున... అనుకున్న సమయానికి అభ్యర్ధుల ఎంపిక పూర్తికానట్లైతే ఆశావహుల చేత నామినేషన్ వేయించి బీ-ఫాంలు ఇచ్చే సమయానికి తుది నిర్ణయం తీసుకోవాలని కూడా కమిటీలోని సభ్యులు కొందరు భావిస్తున్నారు. ఎన్నికలు ఏవైనా... పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు అంతా కలిసి పని చేయాలని పార్టీ అధిష్ఠానం స్పష్టం చేస్తోంది.
ఇదీ చూడండి: మోగిన బల్దియా నగారా.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ