సామాన్య ప్రజానీకంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెనుభారం మోపుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనల్లో భాగంగా... తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తో పాటు నేతలు అంజన్‌కుమార్, దాసోజు శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు. హిమాయత్‌నగర్‌లో ఎన్ఎస్యూఐ నేతలు... 'టూ వీలర్ బైకులు ఫర్ సెల్' అంటూ ప్రదర్శన చేపట్టారు. ద్విచక్రవాహనాలను తోపుడు బండ్ల పై ప్రజలను తరలించి నిరసన చేపట్టారు. లిబర్టీ కూడలి పీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌రెడ్డి రిక్షా తొక్కుతూ నిరనస వ్యక్తం చేశారు. సచివాలయం ఎదురుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పౌర సరఫరా సంస్థ లిమిటెడ్ పెట్రోలు బంక్ వద్ద పీసీసీ రాష్ట్ర కార్యదర్శి మధుకర్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కరోనా నిబంధనలకు అగుణంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు.
జిల్లాల్లో...
జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఇందిరాభవన్ నుంచి కొత్తబస్టాండ్ వరకు ఆటోను తాడుతో లాగుతూ నిరసన తెలిపారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవటంతో... ఉద్రిక్తత నెలకొంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. హన్మకొండలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు. కరోనాతో ప్రజాజీవనం అస్తవ్యస్థంగా మారిన పరిస్థితుల్లో ప్రభుత్వాల తీరు సామాన్యుల నడ్డీ విరిచేలా ఉందని ఆరోపించారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నర్సంపేటలోని పెట్రోల్ బంక్‌ల ముందు బైఠాయించి... కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భూపాలపల్లిలోని పెట్రోల్ బంక్‌ల వద్ద కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలంటూ... నిరసన ప్రదర్శన నిర్వహించారు.