ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు అర్హులైన తెలంగాణ విద్యార్థులకు కాకుండా ఆంధ్ర విద్యార్థులకు కేటాయించారని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. కాళోజీ వర్సిటీ ఉప కులపతి కరుణాకర్‌రెడ్డి.. అనర్హులైన స్థానికేతరులకు అనుకూలంగా వ్యవహరించారని, ఈ విషయంపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర విద్యార్థులకు న్యాయం జరిగేలా వీసీపై చర్యలు తీసుకోవాలని కోరారు. మెడికల్ కళాశాలల ప్రవేశాల్లో బీసీ రిజర్వేషన్ కోటా దుర్వినియోగం అవుతోందన్నారు. సీట్ల కేటాయింపు, నియామకాల్లో వెంటనే ప్రైవేటు ఏజెన్సీలను తొలగించి, ప్రభుత్వ యంత్రాంగాలు పని చేసే దిశగా చర్యలు తీసుకోవాలని శ్రవణ్ సీఎంకు విజ్ఞప్తి చేశారు.
బెదిరింపు కాల్స్‌పై డీజీపీకి వీహెచ్ వినతి
తనకు బెదిరింపు ఫోన్‌కాల్స్ చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు డీజీపీ మహేందర్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఇదీ చూడండి : వెలగపూడిలో రణరంగం.. స్వాగత తోరణం నామకరణంలో విభేదాలు