భాజపాకు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అవినీతి కేసులు పెట్టి జైలుకు పంపించాలని నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ డిమాండ్ చేశారు. గిరిజనులను మోసం చేయడానికే సీఎం కేసీఆర్ నాగార్జునసాగర్ వెళ్లాడని ఆరోపించారు. ప్రశ్నించే గొంతు కావాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఒక్క పని కూడా చేయలేదని... ప్రైవేటు యూనివర్సిటీని మాత్రం సాధించుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చదువుకున్న వారిలో ఉద్యోగాలు లేని వారు ఎంతమంది ఉన్నారో డేటా తీస్తున్నామని పేర్కొన్నారు. ఉద్యోగాలు, ఇళ్లు, ప్రాజెక్టులతో పాటు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టేనని తెలిపారు. అభివృద్ధి కావాలంటే హస్తం గుర్తుకే ఓటేయాలని రాములు నాయక్ కోరారు.