రాష్ట్రంలో త్వరలో జరగబోవు సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రచారాన్ని పకడ్బందీగా చేయాలని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ సూచించారు. గాంధీభవన్‌లో జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇంఛార్జి ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశంలో దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ స్థితిగతులపై చర్చించారు.
మొత్తం 146 గ్రామాలు ఉండగా... ప్రతి రెండు గ్రామాలకు ఒక ఇంఛార్జి, ప్రతి మండలానికి ఒక ముఖ్య నాయకుడు ఇంఛార్జిగా పని చేయాలని మాణికం దిశానిర్దేశం చేశారు. అధికార పార్టీ వైఫల్యాలను ఇంటింటికి చేరవేసి ఓటర్లను కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులను చేసేట్లు కృషి చేయాలన్నారు.
ఈ భేటీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్, వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతురావు, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: వరుస ఎన్నికలపై కారు నజర్.. పకడ్బందీ వ్యూహంతో కార్యాచరణ