రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న 120 పురపాలక, 9 నగరపాలక సంస్థల పరిధిలో 2,727 వార్డులకు, 325 డివిజన్లకు నామినేషన్లు దాఖలు చేయడానికి రేపటితో గడువు ముగియనుంది. ఇవాళ మధ్యాహ్నంలోపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని ఇప్పటికే హైకమాండ్ ఆదేశించింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా శాసనసభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి కసరత్తు చేశారు. ప్రధానంగా ఎస్ఈసీ నియమ నిబంధనలకు లోబడి రిజర్వేషన్లకు అనుగుణంగా ప్రజాధరణ కలిగిన అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ దృష్టి సారించింది.
ఆచితూచి అభ్యర్థుల ఎంపిక..
డీసీసీ అధ్యక్షులు, నగరాధ్యక్షులు, ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, పీసీసీ నియమించిన పరిశీలకులు, సమన్వయ నాయకులు సమావేశంలో పాల్గొని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో వార్డులు, డివిజన్ల వారీగా ఆశావహులను పరిగణనలోకి తీసుకుని చర్చించారు. ప్రతి వార్డు, డివిజన్‌లో భాజపా, తెరాస బరిలో ఉన్నందున అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తోంది.
'సెలక్ట్- ఎలక్ట్' పద్ధతిలో ఎంపిక
పార్టీకి విధేయుడిగా ప్రజాదరణ కలిగి ఉండడం, తెరాసకు దీటుగా నిలబడగలిగే అభ్యర్థులను 'సెలక్ట్-ఎలక్ట్' పద్ధతిన ఎంపిక చేయనున్నారు. ఇన్ని రకాల ప్రమాణాలు కలిగిన పార్టీ నేతలు కొన్ని వార్డులు, డివిజన్లలో లేకపోవడం వల్ల నాయకులు తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది.
మధ్యాహ్నం లోపు తుదిజాబితా విడుదల..
నామినేషన్లు వేసేందుకు రేపటితో గడువు ముగియనుండడంతో... ఇవాళ మధ్యాహ్నానికి అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాల్సి ఉంది. సమయం తక్కువగా ఉన్నందున పోటీలో నిలబడేందుకు ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు ఇప్పటికే కులధ్రువీకరణ పత్రాలు తీసుకోవడంతో పాటు బకాయిలు చెల్లింపులు పూర్తి చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కుల ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో లేని వారు వ్యక్తిగత అఫిడవిట్ ఇస్తే సరిపోతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడం వల్ల కొంత వరకు ఉపశమనం కలిగినట్లేనని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అన్ని వార్డులు, డివిజన్లకు మధ్యాహ్నం లోపు అభ్యర్థుల ఎంపిక పూర్తి అవుతుందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.
ఇదీ చదవండిః ఓట్లే లక్ష్యంగా కాంగ్రెస్ పుర ఎన్నికల మేనిఫెస్టో