Don't compare : మనం ఎంత మంచి మార్కులు తెచ్చుకున్నా, ఎంత సౌకర్యవంతమైన జీవితం గడుపుతున్నా... పక్కవారితో పోల్చుకున్నప్పుడు ఎంతోకొంత లోటు కనిపిస్తూ ఉంటుంది. అది మనలో ఉన్న వెలితి కాదు, పోల్చుకోవడం వల్ల వచ్చిన ఇబ్బంది. అందుకే ఏ విషయంలోనూ ఎదుటివారితో పోలిక సరికాదంటున్నారు మానసిక నిపుణులు.
Don't compare with anyone : నిజానికి పోల్చుకోవడం అనేది ప్రతి ఒక్కరికీ ఉండే సాధారణమైన లక్షణమే. మనకి ఏదన్నా ఆసక్తికరంగా అనిపించినప్పుడు వెంటనే మన మెదడు క్షణంలో దాన్ని మనతో పోల్చుకుంటుంది. మనం తక్కువగా ఉన్నామనే భావన కలిగితే చిన్నబుచ్చుకుంటుంది. దీని వల్ల మన సంతోషం, ఆత్మవిశ్వాసం, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.
ఇలా తరచూ చేయడం వల్ల ఎదుటివారితో మనం కూడా సమానంగా ఉండాలనే తాపత్రయం పెరిగి ఒత్తిడికి గురవుతుంటాం. నెగిటివ్ ఆలోచనలు పెరుగుతాయి. యాంగ్జైటీ, డిప్రెషన్ కలగొచ్ఛు
చేతన.. సాధన.. ఇటీవల జరుగుతున్న అధ్యయనాల ద్వారా తెలిసిందేంటంటే... యువతకు సోషల్ మీడియాలో సమయం గడిపాక ఎక్కువగా ఇలాంటి భావనలు కలుగుతున్నాయట. అందులోనివారికి ఉన్నట్లుగా తమకు ఇల్లు, కారు, విలాసాలు లేవని బాధపడుతున్నారట!
ఆచరిద్దాం.. కృతజ్ఞతా భావాన్ని పెంపొందించుకోవాలి. మనకున్న వాటి పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ... ఇలా జీవించే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెప్పుకోవాలి. అప్పుడు ఆత్మస్థైర్యం పెరుగుతుంది.
ఎదుటివారితో పోల్చుకుని బాధపడటంకన్నా... మనం కూడా నేటికంటే రేపటికి ఇంకా ఎలా అభివృద్ధి చెందగలమనే మంచి ఆలోచన పెంచుకోవాలి. విద్యార్థిగానూ, వ్యక్తిగానూ ఎలా ఉన్నత స్థాయికి వెళ్లాలో వారి నుంచి స్ఫూర్తి పొందాలి.
ఎదుటివారిలో మీరు చూస్తున్నదంతా నిజం కాకపోవచ్చు! ఆశ్చర్యంగా ఉన్నా ఇదే వాస్తవం. ఏమో... మనకు తెలియని ఇబ్బందులు, లోటుపాట్లు వారికి ఉండొచ్చు కదా!
మీ బలాలేంటో గమనించండి. మీకున్న మంచి లక్షణాలను ఒకచోట రాసుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూనే.. ఇతరుల పట్ల గౌరవాన్ని పెంపొందించుకోండి. ఆత్మవిశ్వాసాన్ని మించిన ఆభరణం... ఆనందాన్ని మించిన అందలం... లేవని తెలుసుకోండి!