Shocking Coconut Tree: ఏపీలోని బాపట్ల జిల్లా అద్దంకి మండలం శింగరకొండపాలెం సంఘం ఎస్టీ కాలనీలో ఆ కొబ్బరి చెట్టును చూస్తే విద్యుత్ అధికారుల నిర్వాకం బయటపడుతుంది. ఐదేళ్ల క్రితం కాలనీకి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే సమయంలో కొన్ని స్తంభాలు తక్కువపడ్డాయి. ఆ సమయంలో మాజీ సర్పంచ్ రామాంజనేయులు ఇంటి ముందు ఉన్న కొబ్బరి చెట్టుకు తాత్కాలికంగా విద్యుత్ తీగ ఏర్పాటు చేశారు. తరువాత స్తంభం కోసం దరఖాస్తు చేసుకోవడం.. దాన్ని రప్పించుకోవడంలో కాలనీవాసులు విఫలమయ్యారు. అయితే ఆ తర్వాత మరో ఐదు కనెక్షన్లను కూడా అదే తీగతో ఇచ్చేశారు.
అలా నేటి వరకు ఆ కొబ్బరి చెట్టే విద్యుత్ స్తంభంలా ఉండిపోయింది. విద్యుత్ శాఖ అధికారులు కరెంటు బిల్లు కోసం ఠంఛన్‌గా వచ్చి వసూలు చేసుకుని పోతున్నారే గానీ.. తన చెట్టు గురించి పట్టించుకోవడం లేదని ఇంటి యజమాని వాపోతున్నాడు. వర్షాకాలంలో కొబ్బరి చెట్టుకు విద్యుత్ సరఫరా అవుతుంది. ఏపుగా కాసిన కొబ్బరి కాయలను తెెంపుకోవాలంటే.. పైన విద్యుత్ తీగ భయపెడుతోందని ఆయన అంటున్నాడు. పొరపాటున ఈ విషయం తెలియని వారెవరైనా చెట్టును ముట్టుకుంటే పరిస్థితి ఏంటని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: రాష్ట్రంపై వివక్షతో కేంద్రం దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతోంది: కేటీఆర్
ఫేమస్ అయ్యేందుకు ఐదుగురిని హత్య చేసిన యువకుడు.. నెక్ట్స్ టార్గెట్ పోలీసులేనట!