Singareni Republic Day: ఇప్పటివరకూ కేవలం తెలంగాణకే పరిమితమై ఉన్న సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణలో భాగంగా థర్మల్, సోలార్ విద్యుత్ రంగాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో బొగ్గు బ్లాకులు చేపడుతోందని సింగరేణి సీఎండీ శ్రీధర్ ప్రకటించారు. దీనితో పాటు రాష్ట్రంలో ఇతర ఖనిజ పరిశ్రమ రంగాల్లోకి కూడా అడుగుపెట్టాలని యోచిస్తోందన్నారు. హైదారాబాద్ సింగరేణి భవన్లో జరిగిన 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శ్రీధర్.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు.
16వేల మందికి ఉద్యోగాలు..
ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో అనేక ప్రభుత్వ పరిశ్రమలు సంక్షోభాన్ని ఎదుర్కొంటూ మూసివేత దిశగా కొనసాగుతున్న సందర్భంలో సింగరేణి సంస్థ మాత్రం విస్తరణ దిశగా ముందుకు పోతోందని హర్షం వ్యక్తం చేశారు. చాలా కంపెనీల్లో ఉద్యోగాలను తొలగిస్తుండగా సింగరేణి సంస్థ మాత్రం 7 ఏళ్ల కాలంలో 16 వేల మందికి పైగా యువతకు ఉద్యోగాలు కల్పించిందన్నారు. సంక్షేమం విషయంలో కూడా దేశంలోనే నెంబర్ వన్ కంపెనీగా వెలుగొందుతుందని పేర్కొన్నారు.
"సింగరేణి సంస్థ తన 133 సంవత్సరాల చరిత్రలో.. తొలిసారిగా ఇతర రాష్ట్రాల్లోకి విస్తరిస్తోంది. వచ్చే ఏప్రిల్ నుంచి ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకు నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తున్నాం. అదే రాష్ట్రంలో న్యూపాత్రపాద బొగ్గు బ్లాకును కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. కేంద్ర ప్రభుత్వం వారు వేలంలో పెట్టే ఇతర రాష్ట్రాల్లోని బ్లాకులను కూడా చేపట్టే ఆలోచనలో ఉన్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు తెలంగాణలో ఇనుప ఖనిజ తవ్వకాలు, ఇసుక వంటి పరిశ్రమల్లోకి కూడా విస్తరించాలన్న ఆలోచన చేస్తున్నాం. రానున్న ఐదేళ్లలో మరో 12 కొత్త గనులను సింగరేణిలో ప్రారంభించబోతున్నాం. అనతి కాలంలో సింగరేణి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి స్థాయికి చేరుతుంది." - శ్రీధర్, సింగరేణి సీఎండీ
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రారంభమై కేవలం 5 ఏళ్లు మాత్రమే అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రభుత్వరంగ థర్మల్ విద్యుత్ కేంద్రాల కన్నా మిన్నగా 90 శాతం పీఎల్ఎఫ్తో నెంబర్ వన్ స్థానంలో ఉంటూ మన సింగరేణి ప్రతిభను దేశానికి చాటుతోందని ప్రశంసించారు. ఈ కేంద్రం ప్రతీ ఏటా 400 కోట్ల రూపాయల వరకు కంపెనీకి లాభాలను ఆర్జించి పెడుతోందన్నారు. సింగరేణి సంస్థ ప్రారంభించిన 220 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల వలన లక్షాలాది రూపాయల విద్యుత్ ఖర్చును ఆదా చేసుకోగలుగుతున్నామని సీఎండీ తెలిపారు.
ఇదీ చూడండి: