జీఎస్టీ పరిహారంలో తగ్గే మొత్తం కోసం రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. కేంద్రమే అప్పు తీసుకొని రాష్ట్రాలకు పూర్తి పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానికి లేఖ రాశారు. రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ పరిహారంలో కోత విధించడం సమంజసం కాదని, రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలన్న ప్రతిపాదన ఏ మాత్రం సబబు కాదని కేసీఆర్ స్పష్టం చేశారు.
నష్టపోతామని తెలిసి కూడా..
నష్టపోతామని తెలిసి కూడా విస్తృత ప్రయోజనాల కోసం తెలంగాణ జీఎస్టీకి మద్దతిచ్చిందని.. సీఎస్టీ బకాయిలు రాకపోవడం వల్ల తెలంగాణ రూ. 3800 కోట్లు నష్టపోయిందని సీఎం లేఖలో పేర్కొన్నారు. చట్టప్రకారం రెణ్నెళ్లకోసారి జీఎస్టీ పరిహారం చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమవుతోందని, ఏప్రిల్ పరిహారం ఇంకా అందలేదన్నారు. కరోనా, లాక్ డౌన్ వల్ల ఏప్రిల్ నెలలో రాష్ట్ర ఆదాయం 83 శాతం పడిపోయిందని అదే సందర్భంలో కొవిడ్ సంబంధిత వ్యయం పెరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఆదాయం తగ్గడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. వేతనాలు, ఖర్చుల కోసం అప్పులపై ఆధారపడుతున్నట్లు వివరించారు. 3.5 శాతం అప్పులు తీసుకునే వెసులుబాటు కేంద్రానికి ఉంటే రాష్ట్రాలకు 3 శాతం మాత్రమే ఉండడం రాజ్యాంగ విరుద్ధమని సీఎం అన్నారు. కేంద్రం అప్పు తీసుకుంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయన్న వాదన సరికాదని.. రాష్ట్రాలు అప్పులు తీసుకున్నా అదే పరిస్థితులు ఉంటాయన్నారు.
జీఎస్టీతో ఆదాయం లేదు:
2020-21లో జీఎస్టీ ఆదాయ అంతరాన్ని తగ్గించేందుకు పదిశాతం వృద్ధిని పరిగణలోకి తీసుకోవడం ఏమాత్రం సబబు కాదని సీఎం తెలిపారు. జీఎస్టీ ఆదాయంలో తగ్గుదల, కొవిడ్ కారణంగా రాష్ట్రాలకు ఇచ్చే పరిహారాన్ని తగ్గించడం సరికాదన్న ముఖ్యమంత్రి... పరిహారాన్ని తగ్గించడం జీఎస్టీ చట్టవిరుద్ధమని, జీఎస్టీ పరిహార నిబంధనలకు అర్థం ఉండబోదన్నారు. జీఎస్టీతో రాష్ట్రాలకు ఎక్కువగా ఆదాయం లేకుండా పోయిందన్న కేసీఆర్.. విపత్కర పరిస్థితుల్లో కేంద్రం రాష్ట్రాలకు అండగా ఉండాల్సిదిపోయి న్యాయపరమైన హక్కులను హరించడం సబబు కాదన్నారు. పరిహారం కోసం అప్పు తీసుకోవాలని చెప్పడం రాష్ట్రాలకు అన్యాయం చేయడమేనని సీఎం అభిప్రాయపడ్డారు.
చమురు ధరలతో 2 లక్షల కోట్ల ఆదాయం..
పెట్రోల్, డీజిల్ ధరలను రూ. 13 వరకు పెంచారని.. దీంతో కేంద్రానికి అదనంగా ఏడాదికి రూ. రెండు లక్షల కోట్ల ఆదాయం వస్తుందని కేసీఆర్ తెలిపారు. కరోనాపై పోరాడుతున్న రాష్ట్రాలకు కేంద్రం నుంచి మరింత ఆర్థిక చేయూత అవసరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో జీఎస్టీ పరిహారనిధిలో మిగులు ఉన్నప్పుడు కన్సాలిడేటెడ్ ఫండ్‌కు జమ చేసిన కేంద్రం... తగ్గుదల ఉన్నప్పుడు రాష్ట్రాలు అప్పుతీసుకోవాలని చెప్పడం సబబు కాదని, నిబంధనలను ఉల్లంఘించడం అవుతుందన్నారు. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో తగ్గే పరిహారం మొత్తానికి రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. తగ్గే మొత్తానికి కేంద్రమే అప్పు తీసుకొని జీఎస్టీ సెస్ నుంచే అసలు, వడ్డీ చెల్లించాలని కేసీఆర్ ప్రతిపాదించారు. సెస్ వసూలు గడువును 2022 తర్వాత కూడా పొడిగించే విషయంలో జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు.
సమాఖ్య స్ఫూర్తితోనే బలమైన దేశం:
ప్రస్తుత విపత్కర స్థితిలో కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా సమాఖ్య స్ఫూర్తితో వెళ్తేనే బలమైన దేశంగా ఎదిగేందుకు ఆస్కారం ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల అభివృద్ధే దేశ అభివృద్ధి అన్న ఆయన... బలమైన రాష్ట్రాలే దేశాన్ని బలోపేతం చేస్తాయని తెలిపారు. జీఎస్టీ కౌన్సిల్ ఇప్పటి వరకు అన్నీ ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకొందని.. ఇకముందు కూడా అదే సాంప్రదాయం కొనసాగేలా చూడాలని కేసీఆర్ కోరారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని తాను ప్రతిపాదించిన ప్రత్యామ్నాయాన్ని సానుకూలంగా పరిశీలిస్తారని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీచూడండి: వేలం పాట రద్దు.. ఈసారి బాలాపూర్ లడ్డు ముఖ్యమంత్రి కేసీఆర్‌కే..