జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సమావేశం కానున్నారు. వ్యవసాయం, ఉపాధి హామీ పనులు సహా ఇతర అంశాలపై కలెక్టర్లతో సీఎం చర్చించనున్నారు. ప్రగతిభవన్లో 16న ఉదయం పదకొండున్నరకు జరగనున్న కలెక్టర్ల సమావేశానికి స్థానికసంస్థల బాధ్యతలు చూస్తున్న అదనపు కలెక్టర్లు, జడ్పీసీఈవోలు, జిల్లా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ, వ్యవసాయ అధికారులు కూడా హాజరు కావాలని ఆదేశించారు.
ఉపాధి హామీ పథకం నిధులతో వీలైనన్ని ఎక్కువ శాఖల్లో ఎక్కువ పనులు చేయాలన్న ఆలోచనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల సదస్సులో ప్రధానంగా అదే విషయమై దృష్టి సారించనుంది. ఇప్పటికే మంత్రులు, ఉన్నతాధికారులు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. సంబంధించిన విషయాలపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి చర్చించి వారికి దిశానిర్దేశం చేస్తారు. నియంత్రిత విధానంలో సాగు, రైతువేదికల నిర్మాణం, హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి, కరోనా, సీజనల్ వ్యాధుల నివారణా చర్యలు సహా ఇతర అంశాలపై కూడా సమావేశంలో చర్చకు రానున్నాయి.