CM KCR MEETING WITH FARMER UNIONS LEADERS: కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయ రంగం కునారిల్లిపోనున్న ప్రమాదకర పరిస్థితుల్లో.. రైతు సమస్యలకు కారణాలు, వాటి పరిష్కార మార్గాలపై ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రెండోరోజు సమావేశం జరిగింది. జాతీయ స్థాయిలో రైతుల ఐక్య వేదిక ఏర్పాటు చేయాలని శనివారం నాటి తీర్మానాన్ని అనుసరించి రెండోరోజు చర్చ కొనసాగింది. త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేసి, విధి విధానాలను రూపొందించాలని సమావేశం తీర్మానించింది. సమావేశంలో పలు రాష్ట్రాలకు చెందిన జాతీయ రైతు సంఘాల నేతలు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు.
నాటి సాగు పరిస్థితులకు, మారిన నేటి పరిస్థితులకు అవలంబించాల్సిన ఉద్యమ కార్యాచరణ విధి విధానాలను, పోరాట రూపాల బ్లూ ప్రింట్‌ను తయారు చేసి దేశ రైతాంగాన్ని సంఘటితం చేసే దిశగా చర్యలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ను కోరుతూ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. దశాబ్దాల కాలం నుంచీ రైతులు ఎదుర్కొంటున్న సాగు సమస్యలకు వజ్రోత్సవ స్వతంత్ర భారతంలో ఇంకా పరిష్కారాలు దొరక్కపోవడం దురదృష్ణకరమని సీఎం వ్యాఖ్యానించారు. కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టి వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని జాతీయ రైతు సంఘాల సమావేశం స్పష్టం చేసింది. దేశ రైతాంగాన్ని గ్రామస్థాయి నుంచీ ఐక్యం చేసేందుకు నాయకత్వం వహించాలని సీఎం కేసీఆర్ ను సమావేశం ముక్తకంఠంతో కోరుతూ తీర్మానించింది.
జట్టు కట్టి పట్టు పడితే సాధించలేనిది ఏమీ లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తాను స్వయంగా ప్రారంభించిన తెలంగాణ ఉద్యమం, లక్ష్యాన్ని సాధించి రుజువు చేసిందన్నారు. బేషజాలకు తావు లేకుండా అటు రాజకీయ పంథాకు, ఇటు ఉద్యమ పంథాను సమన్వయం చేసుకుంటూ జమిలి పోరాటాలతో ముందుకు సాగాలనే తుది నిర్ణయం తీసుకోవడం ద్వారా గమ్యాన్ని ముద్దాడినం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. శాంతియుత పంథాలో పార్లమెంటరీ పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.
రాజకీయాలు చేయడం అంటే నామోషీ అని భావించడం తప్పు అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశానికి అన్నంపెట్టే రైతులు చట్టసభల్లోకి ఎందుకు వెళ్లకూడదు..? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా గ్రామగ్రామానికి చేరుకునేలా రైతుల ఐక్యత చాటుదామన్నారు. సాగు రంగాన్ని కాపాడుకునేందుకు అనుసరించాల్సిన విధి విధానాలను, కార్యాచరణ బ్లూ ప్రింట్‌ను సిద్ధం చేసుకుందామన్నారు. దిల్లీ, హైదరాబాద్ సహా, ఉత్తర, దక్షిణ భారత దేశాలను అనుసంధానించేందుకు రైతు కార్యాలయాలను ఏర్పాటు చేసుకుందామన్నారు. ఒక సామాన్య రైతు కూడా దేశ ప్రధానితో ధీటుగా చర్చించే విధంగా వారిని తీర్చిదిద్దుదామన్నారు.
దేశం కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నదని.. ప్లీజ్ సేవ్ ఇండియన్ ఫార్మర్స్.. అంటూ వారు సీఎం కేసీఆర్ ను రైతులు అభ్యర్థించారు. ఇన్నాళ్లూ రైతు సమస్యల పరిష్కారానికి కేవలం ఆందోళనలు, ఉద్యమాలే శరణ్యం అనుకొని తమ జీవితాలను మార్చే రాజకీయాలను విస్మరించామని.. ఇకనుంచీ సీఎం కేసీఆర్ అనుసరించిన మార్గంలోనే కలిసి నడుద్దామని సీనియర్ రైతులు స్పష్టం చేశారు. ఓటు అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి, దేశ రైతాంగ సమస్యలకు పరిష్కారాలను సాధించుకుందాం అని దేశ రైతాంగానికి సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
నూతన వ్యవసాయ చట్టాల పేరుతో, కరంటు మోటార్లకు మీటర్లు పెట్టి, రవాణా చార్జీలను పెంచి, ధాన్యం కొనుగోళ్లను నిలిపివేస్తూ, రైతు పంటల ఎగుమతులు, దిగుమతుల్లో అసంబద్ధ విధానాలను అవలంభిస్తూ, కేంద్ర ప్రభుత్వం అత్యంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నదని సమావేశం అభిప్రాయపడింది. ఒక్క ఎకరం కూడా దేశ రైతు తన భూమిని కోల్పోకుండా కాపాడుకుంటాం.. అని సమావేశం తీర్మానించింది. దళిత బంధు సహా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు తదితర వ్యవసాయాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కేంద్రంలోని పాలకుల్లో భయాన్ని సృష్టిస్తున్నాయని.. కానీ వీటిని దేశవ్యాప్తంగా అమలు పరచడం అనేది చిత్తశుద్ధి ఉంటే సాధ్యమయ్యేదే అని వివిధ రాష్ట్రాల రైతు సంఘాల నాయకులు అభిప్రాయ పడ్డారు. జాతీయ రైతు సంఘాల నేతలను సీఎం కేసీఆర్ శాలువాలతో సత్కరించారు. మూడు రోజులపాటు తెలంగాణలో సాగిన జాతీయ రైతు సంఘాల నేతల పర్యటన నేటితో ముగిసింది.
ఇవీ చూడండి: