CM KCR Review On Heavy Rains: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఎల్లుండి వరకు ఉద్ధృతంగా.. ప్రమాద హెచ్చరికలను దాటి ప్రవహించే పరిస్థితి ఉందని, ఇటీవలి కంటే ఎక్కువ వరదలు సంభవించే ప్రమాదం ఉందని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న వానలు, వరదలపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. త్రయంబకేశ్వరం నుంచి బంగాళాఖాతం వరకు గోదావరి నది.. పొంగిపొర్లుతోందని సీఎం కేసీఆర్ తెలిపారు. గోదావరి ఉపనదులు కూడా నిండి ప్రవహిస్తున్నాయన్నారు. పడ్డ వర్షం పడ్డట్టే వాగులు, వంకలు దాటి చెరువులు, కుంటలు పొంగి నదులకు చేరుకుంటోందని వివరించారు. మరో రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలున్నాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో... ఇటీవలి కంటే ఎక్కువ వరదలు సంభవించే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
గోదావరి నది ఎల్లుండి వరకు ప్రమాద హెచ్చరికలను దాటి ప్రవహించే పరిస్థితులు తలెత్తే ప్రమాదముందని సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి పరీక్షా సమయమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కష్టకాలంలో ప్రజలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. సంబంధిత శాఖల అధికారులందరూ ఉద్యోగ కేంద్రాలను వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరాదన్న సీఎం... తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌కు స్పష్టం చేశారు. వర్షాలు, వరదల పరిస్థితుల్లో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ మొన్నటి మాదిరిగానే వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ సూచించారు. మొన్నటి వరదల సమయంలో అధికారులు బాగా పనిచేశారన్న సీఎం.. ఆరోగ్యశాఖ మంత్రి, డీహెచ్, అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా ఉన్నతీరు అభినందనీయమన్నారు. అదే స్ఫూర్తితో రేపటి విపత్తు నుంచి ప్రజలను కాపాడుకోవాలని సీఎం సూచించారు.
వైద్య-ఆరోగ్య, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్ అండ్ బీ, పురపాలక, మిషన్ భగీరథ తదితర శాఖలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. పోలీసు శాఖలో ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు హెడ్‌క్వార్టర్స్ వదిలి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డికి తెలిపారు. హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదలు, చెరువుల పరిస్థితిని పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తదితరులను సీఎం అడిగి తెలుసుకున్నారు.
"త్రయంబకేశ్వరం నుంచి బంగాళాఖాతం వరకు గోదావరి పొంగిపొర్లుతోంది. గోదావరి ఉపనదులు కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మరో 2, 3రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ఇది పరీక్షా సమయం. కష్టకాలంలో ప్రజలను కాపాడేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలి. అధికారులు వారి ఉద్యోగ కేంద్రాలను వదిలివెళ్లకూడదు. గోదావరి ఎల్లుండి వరకు ఉద్ధృతంగా.. ప్రమాద హెచ్చరికలను దాటి ప్రవహించే అవకాశం ఉంది. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలి. వైద్య, పంచాయతీరాజ్, విద్యుత్, అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి. అన్ని స్థాయిల్లోని పోలీసు సిబ్బంది హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లొద్దు. మొన్నటి వరదల సమయంలో అధికారులు బాగా పనిచేశారు. ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా ఉన్నతీరు అభినందనీయం. అదే స్ఫూర్తితో రేపటి విపత్తు నుంచి ప్రజలను కాపాడుకోవాలి." - సీఎం కేసీఆర్
నీటిపారుదలశాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గోదావరి ప్రవాహాన్ని... శ్రీరాంసాగర్ నుంచి కడెం వరకు ప్రాజెక్టుల పరిస్థితులు, వరదలు వస్తున్న తీరు, సంబంధింత విషయాలను సీఎం కేసీఆర్‌కు వివరించారు. గోదావరి నదీ ప్రవాహం, ఎస్సారెస్పీ నుంచి, కడెం నుంచి వస్తున్న ప్రవాహాలు, గంట గంటకూ మారుతున్న వరద పరిస్థితిని ఉపగ్రహం ఆధారంగా రికార్డు చేసే విధానాన్ని నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ వివరించారు. వాతావరణశాఖ హెచ్చరికల ఆధారంగా కురవబోయే భారీ వర్షాల వల్ల సంభవించే వరదను ముందుగానే అంచనా వేస్తే లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఈ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. వాతావరణ శాఖ వర్షాలను అంచనా వేస్తోందని... తద్వారా వచ్చే వరద ముప్పును పసిగట్టలేకపోతోందని అన్నారు. ఈ పరిజ్ఞానం సాయంతో వరద ముప్పును కూడా అంచనా వేయవచ్చని రజత్ కుమార్ వివరించారు.
ప్రతి ఐదేళ్లకోమారు సైకిల్‌గా వస్తున్న డెంగీ లాంటి వ్యాధులను ముందస్తుగానే అరికట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. మున్సిపల్ కమిషనర్లు, జెడ్పీ సీఈవోలు, ఎంపీడీఓలు, ఆరోగ్య, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు ఈ రెండు రోజులు సెలవులని అలసత్వంగా వ్యవహరించవద్దని ఆదేశించారు. వరదల అనుభవంతో సబ్ స్టేషన్లు మునగకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. అన్ని సబ్స్టేషన్లు ఏ విధంగా నియంత్రణలో ఉన్నాయో సమాచారాన్ని సేకరిస్తూ.. అప్రమత్తంగా ఉండాలని అధికారులను సూచించారు.
ఇవీ చూడండి: