శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై సీఐడీ విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఘటనకు గల కారణాలు వెలికితీయడం సహా ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు బయటకు రావాలని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల మేరకు సీఐడీ అడిషనల్ డీజీపీ గోవింద్ సింగ్‌ను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపి... ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఘటనా స్థలంలో ఉన్న విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రాన్స్‌కో – జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుతో... కేసీఆర్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
అత్యంత దురదృష్టకర ఘటన..
ప్రమాదంలో ప్రాణనష్టం జరగడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అత్యంత దురదృష్టకర ఘటనగా పేర్కొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంపై విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబ సభ్యులకు, బంధువులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చికిత్సపొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని.. ప్రభుత్వ ఖర్చుతో వైద్యం చేయించాలని అధికారులను ఆదేశించారు.