CM KCR letter to PM modi: ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి అర్ధాంతరంగా భారత్కు తిరిగొచ్చిన వైద్య విద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. మానవతా దృక్పథంతో ప్రత్యేక కేసుగా పరిగణించి అనుమతి ఇవ్వాలని కోరారు. యుద్ధం కారణంగా దాదాపు 20వేలకు పైగా విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి వచ్చారన్న కేసీఆర్... దేశ వ్యాప్తంగా వివిధ వైద్యకళాశాలల్లో వారు చదువుకునేలా నిబంధనలు సడలించి అవకాశం ఇవ్వాలని కోరారు.
విద్యార్థుల్లో చాలా మంది మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారని... జీవితాంతం సంపాదించిన డబ్బులతో పిల్లలను వైద్యవిద్య కోసం ఉక్రెయిన్ పంపారని కేసీఆర్ పేర్కొన్నారు. వారి భవిష్యత్ ను కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఆ విద్యార్థులకు సరిపడా సీట్లను ఆయా వైద్యకళాశాలల్లో ఈ ఒకసారికి పెంచాలని కోరారు. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థుల్లో తెలంగాణకు చెందిన వారు 700 మందికి పైగా ఉన్నారన్న కేసీఆర్... వారి విద్యాభ్యాసం పూర్తి చేసేందుకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు నిర్ణయించిందని తెలిపారు. మానవతా దృక్పథంతో వీలైనంత త్వరగా విద్యార్థుల విషయమై నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కోరారు.
ఇదీ చూడండి: