వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలో మరో దఫా పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని కూడా పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగానే నిర్వహించనున్నారు. కార్యక్రమాల ప్రారంభం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, డీఆర్డీఓలతో ప్రగతి భవన్లో సీఎం సమావేశం కానున్నారు. అటవీ శాఖకు సంబంధించిన జిల్లాస్థాయి అధికారులు, సంరక్షకులను కూడా సమావేశానికి ఆహ్వానించారు. మంత్రులు, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొంటారు.
పారిశుద్ధ్య నిర్వహణ వల్లే..
పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలు విజయవంతమయ్యాయని, సత్ఫలితాలు ఇస్తున్నాయని సీఎం కేసీఆర్ ఇప్పటికే తెలిపారు. ఈ కార్యక్రమాల కారణంగానే రాష్ట్రంలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా జరిగి సీజనల్ వ్యాధులు ప్రబలడం లేదని ప్రభుత్వం చెబుతోంది. పల్లె, పట్టణ ప్రగతి ఫలితాలు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తున్నాయని సర్కార్ అంటోంది. అయితే చేరుకోవాల్సిన లక్ష్యాలు మాత్రం ఇంకా ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పల్లెలు, పట్టణాలు బాగు చేసుకోవడానికి మించిన ప్రాధాన్యత ఇంకేమీ లేదని సీఎం అన్నారు. అదనపు కలెక్టర్లు, అధికారుల నుంచి తాను ఎంతగానో ఆశించానని... అయితే క్షేత్రస్థాయిలో పనితీరు అందుకు తగ్గట్లుగా లేదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రజలందరినీ భాగస్వాములను చేసి పల్లెలు, పట్టణాలను బాగు చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని... మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న పల్లెప్రగతి, పట్టణప్రగతి తో పాటు హరితహారానికి సంబంధించిన కార్యాచరణపై సమావేశంలో చర్చిస్తారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా చేయాల్సిన పనులు, అమలు చేయాల్సిన ప్రణాళికపై కసరత్తు చేస్తారు. హరితహారంలో భాగంగా ఈ దఫా దాదాపు 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మూడు వేల కిలోమీటర్ల మేర...
ఎక్కువ రోజులు కాకుండా కార్యక్రమాన్ని ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే మొక్కలు నాటాలని కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. మండల కేంద్రాలు, పట్టణాల్లో ఐదు నుంచి ఐదు ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి వనాలను అభివృద్ధి చేసే విషయమై లక్ష్యాన్ని నిర్దేశించనున్నారు. హరితహారంలో భాగంగా ఈ దశలో.. రహదారుల వెంట కనీసం మూడు వేల కిలోమీటర్ల మేర బహుళ వరసల రహదారి వనాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మేడ్చల్ నుంచి రాష్ట్ర సరిహద్దు వరకు 44వ జాతీయ రహదారి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టనున్నారు. పల్లె, పట్టణప్రగతి లో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ, శిథిలాల తొలగింపు, చెత్త సేకరణ, వైకుంఠ ధామాలు, మార్కెట్లు తదితరాలపై దృష్టి సారించనున్నారు. వీటన్నింటికి సంబంధించి అధికారులతో చర్చించి ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు. పది రోజుల పాటు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అమలు చేయాల్సిన విధానం... ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ విజయవంతం దిశగా అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.