జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వ్యూహాలకు తెరాస మరింత పదును పెడుతోంది. నేడు నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానున్నందున... పార్టీ బలగాలను పూర్తిగా రంగంలోకి దించేందుకు సర్వం సిద్ధమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలందరూ ఇవాళ్టి నుంచి క్షేత్రస్థాయిలో దిగనున్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెరాస పార్లమెంటరీ, శాసనసభ పక్షం సమావేశం జరగనుంది. సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని కేసీఆర్ ఆదేశించారు.
ఎలా వ్యవహరించాలి..
ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలకు డివిజన్‌కు ఒకరు చొప్పున బాధ్యతలు అప్పగించారు. నామినేషన్ల నుంచి మేయర్ ఎన్నిక పూర్తయ్యే వరకు అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. ఏయే అంశాలతో ప్రజల్లోకి వెళ్లాలి, విపక్షాల ప్రచారాన్ని ఎలా తిప్పి కొట్టాలి... క్షేత్రస్థాయిలో ఏ విధంగా వ్యవహరించాలనే అంశాలను నేతలకు వివరించనున్నారు.
జాబితా రెడీ!
జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లకు అభ్యర్థులను నేడు తెరాస ప్రకటించనుంది. నిన్న రాత్రే తుది జాబితాను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, జీహెచ్ఎంసీ ఎన్నికల సారథి కేటీఆర్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. తెరాస పార్లమెంటరీ, శాసనసభ పక్షం సమావేశం ముగిసిన వెంటనే జాబితా వెల్లడించే అవకాశం ఉంది. ఎక్కువగా సిట్టింగ్ అభ్యర్థులకే టిక్కెట్లు ఇవ్వాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. అయితే ఎంఐఎం బలంగా ఉన్న ప్రాంతాల్లో స్నేహపూర్వక పోటీ చేయనుంది.
వినకపోతే వేటే..!
ఒక్కో డివిజన్ నుంచి అర డజను నుంచి డజనుపైగా ఆశావహులు ఉన్నారు. అభ్యర్థులను ప్రకటించగానే అసమ్మతి, అసంతృప్తి పెల్లుబికే అవకాశం ఉన్నందున... మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు జాగ్రత్తగా చక్కదిద్దాలని కేసీఆర్ వివరించనున్నారు. భవిష్యత్తులో అనేక అవకాశాలు ఉంటాయని వివరించాలని... ఒకవేళ వినకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించారు. వివిధ ఎన్నికల్లో పనిచేసిన అనుభవం ఉన్న పది మంది సీనియర్ నేతలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనున్నారు.
ఇదీ చూడండి: తెరాసలో టికెట్ కోసం పోటాపోటీ.. సిట్టింగ్‌లకే ఇచ్చే అవకాశం..