CM Jagan Rythu Bharosa: రైతు సంక్షేమానికి కట్టుబడి.. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్న ప్రభుత్వం తమదని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఏపీ ఏలూరు జిల్లా గణపవరంలో వైఎస్‌ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్... రైతు భరోసా నిధులు విడుదల చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ మొదలుకాక ముందే.. రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నామని సీఎం చెప్పారు.
పంట నష్టపోయిన రైతులకు ఏ సీజన్ డబ్బులు అదే సీజన్‌లో వేస్తూ ఆదుకుంటున్న ప్రభుత్వం తమదే అని సీఎం చెప్పారు. ముందే క్యాలెండర్ ఇచ్చి రైతు భరోసా అమలు చేస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. తొలి విడతలో రైతుల ఖాతాల్లో రూ.5,500 జమ చేస్తున్నట్లు తెలిపారు. నాలుగు విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.13,500 జమకానున్నట్లు వెల్లడించారు.
మూడేళ్లుగా రాష్ట్రంలో ఒక్క కరవు మండలం లేదన్న జగన్...మూడేళ్లలో రాష్ట్రంలో భూగర్భ జలాలు భారీగా పెరిగాయన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 16 లక్షల టన్నులు పెరిగిందని స్పష్టం చేశారు. రైతులకు వడ్డీ లేని రుణాల పథకం కింద రూ.1282 కోట్లు అందజేశామని చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను ఆదుకుంటున్నామన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతులు, కౌలురైతుల కుటుంబాలకు రూ.7 లక్షల ఆర్థికసాయం అందజేస్తున్నామని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు దత్తపుత్రుడు రైతుల పరామర్శకు బయలుదేరారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. పరిహారం దక్కని ఒక్క రైతునూ చూపలేకపోయారని విమర్శించారు. పంట సీజన్ ముగిసేలోగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. రైతు బీమాను ప్రభుత్వం తరఫున చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని సీఎం జగన్ అన్నారు.
"మళ్లీ వైఎస్ఆర్ రైతు భరోసా సొమ్మును గణపవరం వేదిక నుంచి విడుదల చేస్తున్నాం. తొలి విడతలో రైతుల ఖాతాల్లో రూ.5,500 జమ చేస్తున్నాం. చంద్రబాబు దత్తపుత్రుడు రైతుల పరామర్శకు బయలుదేరారు.పరిహారం దక్కని ఒక్క రైతునూ చూపలేకపోయారు.పంట సీజన్ ముగిసేలోగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తాం." -వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
ఇదీ చదవండి: 'మనకు పోటీ బెంగళూరుతో కాదు సింగపూర్‌తో..'
గుడ్‌న్యూస్.. దేశంలోకి నైరుతి రుతుపవనాల ఎంట్రీ.. ఇక వానలే వానలు!