Telangana Inter Exams Schedule : జేఈఈ మెయిన్ పరీక్ష తేదీలను ఎన్టీఏ మార్చడంతో... ఇంటర్, పదో తరగతి పరీక్షల షెడ్యూలుపై గందరగోళం నెలకొంది. ఇంటర్, పదో తరగతి పరీక్ష టైం టేబుల్ మార్చాలని విద్యాశాఖ సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 20 నుంచి మే 10 వరకు ఇంటర్ పరీక్షలు... మే 11 నుంచి 20 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించేలా విద్యాశాఖ మొదట షెడ్యూలు ప్రకటించింది.
మరోసారి మార్చక తప్పని పరిస్థితి
అయితే ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు ఉంటాయని ఎన్టీఏ ప్రకటించడంతో... ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించేలా ఇంటర్ బోర్డు షెడ్యూలును సవరించింది. పరీక్షలకు చురుగ్గా ఏర్పాట్లు జరగుతుండగా... జేఈఈ మెయిన్ తేదీలను ఎన్టీఏ మార్చడం గందరగోళానికి దారి తీసింది. మరోసారి ఇంటర్ పరీక్షలు మార్చక తప్పని పరిస్థితి ఏర్పడిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
ఆ పరీక్షలు ఒకేసారి జరపలేం
ఇంటర్‌తో పాటు పదో తరగతి పరీక్షల షెడ్యూలు కూడా మార్చాలని విద్యా శాఖ భావిస్తోంది. జేఈఈ మెయిన్ పరీక్షలు ముగిసిన తర్వాత పరీక్షలు నిర్వహించాలంటే... మే 5 తర్వాత ఇంటర్ పరీక్షలు ప్రారంభించాల్సి ఉంటుంది. ఇంటర్ పరీక్షలకు ఉపాధ్యాయులు కూడా ఇన్విజిలేటర్లుగా వ్యవహరించడంతో పాటు... కొన్ని పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇంటర్, పదో తరగతి పరీక్షలు ఒకేసారి జరపలేమని అధికారులు చెబుతున్నారు.
ఇవాళ స్పష్టత
ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక పదో తరగతి పరీక్షలు జరపాలంటే మే నెలాఖరు వరకు వేచి చూడాల్సి ఉంటుంది. మే నెలలో వేసవి తీవ్రత వల్ల విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. జేఈఈ మెయిన్ ప్రారంభం కాకముందే ఏప్రిల్ 21లోపే పూర్తి చేయడం సాధ్యమా అనే కోణంలోనూ అధికారులు ఆలోచిస్తున్నారు. ఇంటర్ పనిదినాలు సరిపోవని.. విద్యార్థులు ఇబ్బంది పడతారని భావిస్తన్నారు. కనీసం పదో తరగతి పరీక్షలైనా జేఈఈ మెయిన్‌కు ముందే జరపడానికి అవకాశం ఉంటుందా అనే కోణంలో తర్జన భర్జన చేస్తున్నారు. ఇంటర్, పదో తరగతి పరీక్షల షెడ్యూలుపై రేపు స్పష్టత రానుంది.
ఇదీ చదవండి:మీరు చేసిన తప్పులను సరిదిద్దడం తప్పా?: మంత్రి హరీశ్‌రావు