CJI Justice NV Ramana in Vijayawada ఆర్ధికంగా ఇబ్బందులున్న రాష్ట్రాల్లో కోర్టు భవనాల పూర్తి ఆలస్యమవుతుంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. విజయవాడలో నూతన కోర్టు భవన సముదాయాన్ని ప్రారంభించిన ఆయన...న్యాయస్థానాల నిర్మాణానికి అదనపు నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు చెప్పారు. అందుకు ఏపీ, బెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులు మద్దతు పలికారని అన్నారు. వారికి సీజేఐ కృతక్షతలు చెప్పారు.
న్యాయవాదులు సమాజంలో బాధ్యతాయుతమైన వ్యక్తులని సీజేఐ అన్నారు. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు బాధ్యత తీసుకోవాలని కోరారు. జూనియర్ న్యాయవాదులను దగ్గరకు తీసుకుని ప్రోత్సహించాలని సూచించారు. తన వృత్తి జీవితంలోని అనుభవాలను సీజేఐ ఈ సందర్భంగా పంచుకున్నారు.
"పెండింగ్ కేసులతో పాటు అనేక కారణాలు ఉన్నాయి. ప్రజలకు తక్కువ వ్యవధిలో న్యాయం చేకూర్చాలి. సత్వర పరిష్కార తపన జడ్జిలు, న్యాయవాదులకు ఉండాలి. అంతిమంగా ప్రజా సమస్యల పరిష్కారం, న్యాయం చేకూర్చాలి. న్యాయవ్యవస్థ కూలిపోతే ప్రజాస్వామ్య మనుగడకే ముప్పు. ప్రజలకు న్యాయం చేయడానికి ప్రయత్నించాలి. న్యాయవ్యవస్థను పటిష్టపరిచే చర్యలు చేపట్టాలి. న్యాయవ్యవస్థ పటిష్టతకు లాయర్లు తప్పనిసరిగా సహకరించాలి. విశాఖలోని కాంప్లెక్స్‌కు నిధులు ఇవ్వాలని సీఎంను కోరుతున్నా. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు." -సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
కోర్టు భవనాలను ప్రారంభించిన సీజేఐ..
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో నూతన కోర్టుల భవనాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌తో కలిసి ప్రారంభించారు. కోర్టుల ప్రాంగణంలో తొలుత మొక్కను జస్టిస్ రమణ, ముఖ్యమంత్రి జగన్ నాటారు. తర్వాత సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఒకే భవనంలో 31 కోర్టులతో భవన సముదాయం నిర్మించారు.
2013 మే 13న కోర్టుల సముదాయానికి రాష్ట్ర తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్ ఎన్వీ రమణ భూమిపూజ చేశారు. దాదాపు వంద కోట్ల వ్యయంతో ఎనిమిది అంతస్తులతో భవనాల సముదాయాన్ని నిర్మించారు. ఒక్కో అంతస్తులో నాలుగు కోర్టులు ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవానికి హైకోర్టు న్యాయమూర్తులు తరలివచ్చారు. కృష్ణా జిల్లా న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.
"దాదాపు పదేళ్ల క్రితం ఈ సముదాయానికి శంకుస్థాపన చేశా, ఇవాళ మళ్లీ నేనే ప్రారంభిస్తుండడం చాలా గొప్ప విషయం. రాష్ట్ర విభజన, ఆర్థిక సమస్యలు, నిధుల జాప్యంతో ఆలస్యమైంది. పూర్తయిన భవనాలను సక్రమంగా వినియోగించుకోవాలి. ప్రజలకు సత్వరం న్యాయం చేయడం అందరి బాధ్యత. ఆర్థిక ఇబ్బందులున్న రాష్ట్రాల్లో భవనాల పూర్తికి నిధులు ఇవ్వాలని కోరా. కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. కొందరు సీఎంలు.. కేంద్రమే బాధ్యత తీసుకోవాలని మద్దతిచ్చారు." -సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
ఇవీ చదవండి: