CJI Justice NV Ramana : స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను పురస్కరించుకుని వచ్చే ఏడాది జరిగే 75వ స్వాతంత్య్ర వేడుకల నిర్వహణ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో ఏర్పాటైన జాతీయ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణకు చోటు కల్పించారు. ఇది వరకు సీజేఐగా ఉన్న జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే పేరును తొలగించి, ఆ స్థానంలో జస్టిస్ ఎన్వీ రమణ పేరును చేరుస్తూ కేంద్ర సాంస్కృతికశాఖ సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబులకూ ఈ కమిటీలో కొత్తగా చోటు దక్కింది.
Independence Day National Committee : ఇదివరకు మార్చి 5వ తేదీన జారీచేసిన తొలి నోటిఫికేషన్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మోహన్‌రెడ్డితోపాటు, గవర్నర్ హోదాలో బండారు దత్తాత్రేయ, రాజకీయ పార్టీల అధినేతలుగా చంద్రబాబునాయుడు, సీతారాం ఏచూరి, మీడియా నుంచి రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు, కళారంగం నుంచి ఎస్‌ఎస్ రాజమౌళి, క్రీడల నుంచి పుల్లెల గోపీచంద్, పీవీ సింధు, మిథాలీరాజ్, పారిశ్రామిక రంగం నుంచి భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల పేర్లున్నాయి. తాజాగా మరో ముగ్గురి పేర్లు చేరడంతో జాతీయ కమిటీలో తెలుగువారి ప్రాతినిధ్యం పెరిగినట్లయింది.