ఏపీలో రామతీర్థం, రాజమహేంద్రవరం విఘ్నేశ్వరాలయం ఘటనలపై సీఐడీ విచారణకు ఆదేశించామని ఆ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. రామతీర్థం ఘటన నిందితులను మూడు రోజుల్లో పట్టుకుంటామని స్పష్టం చేశారు. రామతీర్థంను పూర్తిగా ఆధునికీకరణ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆగమశాస్త్రం ఆధారంగా విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ నిర్మాణం చేపడతామని చెప్పారు. ఏపీ వ్యాప్తంగా దేవాలయాలపై జరుగుతున్న దాడుల అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రామతీర్థం ఆలయ నమూనాను ఏపీ మంత్రి మీడియాకు విడుదల చేశారు.
ఆధారాలు దొరికాయి...
రామతీర్థం ఘటన సున్నితమైందన్న మంత్రి వెల్లంపల్లి.. ఈ ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందన్నారు. నిందితులను అరెస్టు చేసేందుకు ఆధారాలు దొరికాయని చెప్పారు. మంగళవారం తలపెట్టిన ర్యాలీని విరమించుకోవాలని భాజపాను కోరారు. చిన్న ఆలయాల్లో తాత్కాలిక విగ్రహాలు ధ్వంసమైతే ప్రభుత్వానికి ఆపాదించటం సరికాదన్నారు.
ఆలయాలపై దాడులకు సంబంధించి 88 కేసులు నమోదయ్యాయి. ఆయా ఘటనల్లో 169 మందిని అరెస్టు చేశాం. ఏపీలో 57,584 ఆలయాలు ఉన్నాయని పోలీసుశాఖ మ్యాపింగ్ చేసింది. ప్రస్తుతం 3 వేల ఆలయాల్లోనే సీసీ కెమెరాలు అమర్చారు. సీసీ కెమెరాలపై దేవాదాయశాఖ కార్యాచరణ ప్రణాళిక ఇచ్చింది. నిబంధనలను ప్రైవేట్ ఆలయాలూ అనుసరించేలా ప్రణాళిక చేపట్టాం.
- వెల్లంపల్లి శ్రీనివాస్, ఏపీ దేవాదాయశాఖ మంత్రి
ఇవీచూడండి: ఉద్రిక్త తీర్థం.. నేతల పోటాపోటీ పర్యటనలతో క్షణక్షణం ఉత్కంఠ