Youtuber Arrested in AP : ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేసిన తెలుగుదేశం కార్యకర్త వెంగళరావును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. "ఘర్షణ" పేరిట యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న వెంగళరావు.. కుప్పం ఘటనపై ప్రజలు తిరగబడాలంటూ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలపైనే వెంగళరావుని సీఐడీ అధికారులు అరెస్టు చేసినట్లు సమాచారం. వెంగళరావుని విడుదల చేయాలంటూ గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద తెలుగుదేశం నాయకులు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వెంగళరావు తరపున్యాయవాదులను పోలీసులు సీఐడీ కార్యాలయంలోకి అనుమతించారు. సీఐడీ కార్యాలయం వద్దకు వచ్చిన వెంగళరావు తల్లిదండ్రులు.. తమ కుమారుడిని ఏం చేస్తారోనని ఆందోళన వ్యక్తం చేశారు.
వెంగళరావును సీఐడీ అధికారులు జడ్జి ఎదుట హాజరుపరిచారు. కోర్టు సమయం ముగియడంతో జడ్జి ఇంటికే వెంగళరావును తీసుకెళ్లారు. జడ్జి ఎదుట వెంగళరావు సీఐడీ పోలీసులు తనను కొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను బట్టలిప్పి కొట్టారని.. కొట్టినట్లు చెప్పితే బెయిల్ రాదని బెదిరించారని వాపోయాడు. ఒకవేళ చెప్తే కేసుల్లో ఎలా ఇరికించాలో తమకు తెలుసని... తనను కొట్టి పేపర్‌పై సంతకం తీసుకున్నారని తెలిపాడు. వెంగళరావును ఎలా కొట్టారని న్యాయమూర్తి ప్రశ్నించగా.. బల్లపై పడుకోబెట్టి నడుంపై కూర్చుని కాళ్లు పైకెత్తి కొట్టారని వివరించాడు.