కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అగ్ర కథానాయకుడు చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు. వెండితెరపై తనదైన నటనతో అలరించడమే కాదు, అవసరమైన వారికి తన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఆదుకుంటున్న చిరు ఇప్పుడు ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో చిరు ఆక్సిజన్ బ్యాంకును త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. తాజాగా ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
‘‘సమయానికి రక్తం దొరక్క ఎవరూ మరణించకూడదనే సంకల్పంతో 1998లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రారంభించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమయానికి ఆక్సిజన్ అందక ఎవరూ మరణించకూడదనే సంకల్పంతో చిరు ఆక్సిజన్ బ్యాంకు ప్రతి జిల్లాలోనూ నెలకొల్పాలని నిర్ణయించారు. వచ్చే వారం రోజుల్లో ప్రజలకి ఆక్సిజన్ బ్యాంకు అందుబాటులోకి వచ్చే విధంగా ఏర్పాట్ల చేస్తున్నారు’’ అని చిరంజీవి ఆఫీస్ ఒక ప్రకటన విడుదల చేసింది.