కొవిడ్ మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. తల్లిదండ్రులకు పిల్లలను, పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేసి వారిని శోక సంద్రంలో ముంచింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా తనకల్లు మండలం వంకపల్లికి చెందిన శ్రీ రాములు, లలితమ్మ దంపతులు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా జీవనం సాగిస్తున్న ఈ కుటుంబాన్ని కరోనా అల్లకల్లోలం చేసింది.
గత కొన్ని రోజుల కిందట శ్రీరాములుకు కరోనా సోకింది. చికిత్స పొందుతూ అతను రెండు నెలల కిందట మృతిచెందాడు. భర్త మృతిని జీర్ణించుకోలేని లలితమ్మ అనారోగ్యం బారిన పడింది. శక్తిని కూడదీసుకుని పిల్లల కోసమైనా బతకాలని ఆరాటపడింది కానీ అనారోగ్యంతో చనిపోయింది. దాంతో పిల్లలు స్పందన (17), తరుణ్(15) అనాథలయ్యారు.
"అప్పుడు నాన్నను.. ఇప్పుడు అమ్మను రెండు నెలల వ్యవధిలో దూరం చేసి దిక్కులేని వాళ్లగా ఎందుకు చేశావు దేవుడా" అంటూ ఆ పిల్లలు రోదిస్తున్న తీరు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. అనాథలైన పిల్లలను ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: Revanth: 'రేపు చలో రాజ్‌భవన్... అడ్డుకుంటే పోలీస్‌స్టేషన్లనూ ముట్టడిస్తాం'