ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు, మరణాలపై కారణాలను దర్యాప్తు సంస్థలు తేల్చాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. సమ్మె కారణంగానే కార్మికులు బలవన్మరణాలు, గుండెపోటుతో మరణిస్తున్నారన్న విధంగా ప్రచారం చేయడం సరికాదని తెలిపింది. ఆత్మహత్యలను నిలువరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి కౌంటరు దాఖలు చేశారు.
నిరాధార సమాచారం, ఆరోపణలతో ప్రభుత్వంపై నిందలు వేస్తూ వ్యాజ్యం దాఖలు చేశారని కౌంటరులో ప్రభుత్వం పేర్కొంది. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ కమిషనర్‌ను హైకోర్టు ఇప్పటికే ఆదేశించిందని తెలిపింది. కార్మికుల వేతనాలు, ఇతర డిమాండ్లన్నింటిపై కార్మిక శాఖ కమిషనర్ చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటారని వివరించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేయాలని హైకోర్టును ప్రభుత్వం కోరింది.